Take a fresh look at your lifestyle.

అమెరికా దురాక్రమణతో ప్రపంచ శాంతికి ముప్పు -సీపీఐ జాతీయ నియంత్రణ కమిషన్ ఛైర్మన్ కె. నారాయణ

ఇరాన్‌పై సైనిక దాడులు వెంటనే నిలిపివేయాలి
సామ్రాజ్యవాద విధానాలను వ్యతిరేకిస్తున్న దేశాలు ముందుకురావాలి

ముద్ర, తెలంగాణ బ్యూరో :

అమెరికా ప్రభుత్వ దురాక్రమణ విధానాలు ప్రపంచ శాంతికి ముప్పుగా మారుతున్నాయని సీపీఐ జాతీయ నియంత్రణ కమిషన్ ఛైర్మన్ కె. నారాయణ ఆరోపించారు. ఇరాన్‌పై జరుగుతున్న సైనిక దాడులను తక్షణమే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. యుద్ధంతో సాధారణ ప్రజలకే భారీ నష్టం, విధ్వంసం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సామ్రాజ్యవాద విధానాలను వ్యతిరేకిస్తున్న దేశాలు, ముఖ్యంగా రష్యా, చైనా ఐక్యంగా ముందుకు వచ్చి యుద్ధ పరిస్థితులను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని మఖ్దూమ్ భవన్ లో జరుగుతున్న సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం రెండవ రోజు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. జాతీయ, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. క్యూబా దేశం ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక, ఆర్థిక సంక్షోభాన్ని వివరించిన ఆయన అమెరికా విధించిన దీర్ఘకాలిక ఆర్థిక నిర్బంధం, ప్రపంచ ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా క్యూబా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నప్పటికీ, అక్కడి ప్రజలు ధైర్యంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణ ఆసియా దేశాల్లో ప్రస్తుతం ముఖ్యమైన రాజకీయ, సామాజిక మార్పులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా శ్రీలంకలో జరిగిన ప్రజా ఉద్యమంలో యువత చారిత్రాత్మక పాత్ర పోషించిందని చెప్పారు. ప్రజల ఐక్య పోరాటం ఎంతటి మార్పులను తీసుకురాగలదో అది చూపిందన్నారు. భారతదేశ రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడుతూ కేరళలో జరగబోయే ఎన్నికలను ప్రస్తావించారు. ప్రస్తుతం అక్కడ ఎల్‌డీఎఫ్ బలమైన స్థితిలో ఉందని, యూడీఎఫ్‌ను ఓడించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రజల సమస్యలతో మమేకమై వామపక్ష ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సీపీఐని మరింత బలోపేతం చేయడానికి, సామూహిక పోరాటాలను విస్తరించడానికి, యువత, కార్మిక వర్గాలను పెద్ద ఎత్తున ఉద్యమాల్లోకి తీసుకురావాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.