- బీదర్ లో ఏటీఎం వాహనం సిబ్బందిపై దాడి , దోపిడి
- రూ.95 లక్షలను దోచుకున్న దొంగలు
- ముఠాలో ఒకర్ని పట్టుకున్న పోలీసులు
- పరారైన దొంగల కోసం గాలింపు
ముద్ర, తెలంగాణ బ్యూరో : కర్ణాటకలోని బీదర్ పట్టణంలో గురువారం ఉదయం ఏటీఎం వాహనంపై దోపిడీకి పాల్పడిన ముగ్గురు సభ్యుల దొంగల ముఠా హైదరాబాద్ చేరుకుని అఫ్జల్ గంజ్ లో పోలీసులపై కాల్పులు జరిపి కలకలం సృష్టించారు. ఏటీఎంలో డబ్బులు పెట్టేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి రూ.93 లక్షల నగదుతో ఈ దొంగలు పరారయ్యారు. ఈ క్రమంలో దొంగలను వెతుక్కుంటూ వచ్చిన బీదర్ పోలీసులపై అఫ్జల్ గంజ్ లో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడగా, ముఠాలోని ఒక సభ్యుడుని పోలీసులు పట్టుకున్నారు. బీదర్ దొంగల ముఠా సభ్యులిద్దరూ హైదరాబాద్ నుంచి రాయపూర్ వెళ్ళేందుకు ట్రావెల్స్ బస్సు టికెట్లు బుక్ చేసుకున్నారు.
ఈ క్రమంలో దొంగలు గురువారం సాయింత్రం అఫ్జల్ గంజ్ లో బస్సు కోసం వేచియున్న సమయంలో బీదర్ పోలీసులు రావడంతో వారిపై కాల్పులు జరిపారు. దొంగల ముఠా జరిగిన కాల్పుల్లో ట్రావెల్స్ మేనేజర్ జహంగీర్ కడుపులోకి బుల్లెట్ దిగింది. మరో వ్యక్తికి కూడా బుల్లెట్ తగిలింది. జహంగీర్ ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ముఠాలో ముగ్గురు నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతావారిని పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు.