ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
అణగారిన వర్గాల ప్రజలు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో సమాన అవకాశాలను అందిపుచ్చుకుని అభివృద్ధి పధంలో నడవడానికి డా. బి. ఆర్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ బద్దమైన రిజర్వేషన్లు కారణమని తెలంగాణా రాష్ట్ర శాసన సభాపతి అన్నారు. మంగళవారం పట్టణం లో రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న డాక్టర్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా ఎస్సి అభివ్రుది అధికారి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశం లో సభాపతి మాట్లాడుతూ రాజ్యాంగ ప్రదాత, దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల ఆత్మబందువు, భారతరత్న డాక్టర్ భీం రావు అంబెడ్కర్ భారతదేశంలో సామాజిక మార్పులకు కారణమైన సంఘ సంస్కర్త జ్యోతిబా పూలే, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, పేదల పక్షపాతి బాబు జగ్జీవన్ రామ్ జన్మించింది ఎప్రిల్ నెలలోనే అని, స్వతంత్య్ర భారతదేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన అంబేద్కర్ సమాజాన్ని కదిలించాడని , సమాజంతో పాటు రాజ్యమే కదిలిందని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చింది గాంధీవలన అయితే, స్వతంత్ర భారత దేశ పరిపాలన సజావుగా జరగడానికి, దేశ పౌరులు శాంతి పూర్వకంగా బతకడానికి అవసరమైన రాజ్యాంగ రచనలో కీలకపాత్ర పోషించిన వ్యక్తి అంబేడ్కర్ అని అన్నారు. రాజ్యాంగంలో కల్పించిన చిన్న రాష్ట్రాల ఏర్పాటు అంశంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అంబేద్కర్ అనేది ఒక పేరు కాదు, అది ఈ దేశ ప్రజల జీవన రేఖ. దళిత, బడుగు బలహీన వర్గాల జీవితాలకు వెలుగును ఇచ్చిన సూర్యుడు అంబేద్కర్, దేశంలో అట్టడుగు వర్గాలు విద్య, ఉద్యోగాలలో తమ వాటాను పొందుతూ, రాజకీయ రంగాలలో కీలకమైన పదవులలో ఉంటున్నారు అంటే దానికి కారణం అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లు మాత్రమేనని అన్నారు. అంబెడ్కర్ కల్పించిన రాజ్యాంగం హక్కుల ద్వారా దేశంలోని ప్రతి పౌరుడుకి సామాజికంగా, ఆర్థికంగా రాజకీయంగా సమానమైన అవకాశాలు అందుతున్నాయని అన్నారు. పూరి గుడిసెలో, గిరిజన గూడేలలో పుట్టిన వారు కూడా దేశ అత్యున్నత పదవులు పొందుతున్నారు అంటే దానికి ఏకైక కారణం అంబేద్కర్ అందించిన రిజర్వేషన్లు అనే బ్రహ్మాస్త్రం అని అన్నారు. ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే నేను మంగళవారం రాష్ట్రంలో అత్యున్నత పదవి అయిన శాసనసభ సభాపతి అయ్యాను. జీవనది ఎల్లప్పుడూ ఎలా ప్రవహిస్తుందో అలాగే అంబెడ్కర్ విజ్ఞానం శతాబ్దాల పాటు ఈ దేశ యువతకు స్పూర్తిని ఇస్తుందని అన్నారు.
రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు, స్వేచ్ఛ స్వాతంత్ర్యం, సంక్షేమ కార్యక్రమాల అమలు అందరికీ అందినపుడే అంబేద్కర్ కన్న కలలు నెరవేరుతాయని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో దేశంలోనే మొదటిసారిగా నేను శాసనసభ సభాపతి స్థానంలో ఉండగా తెలంగాణలో SC వర్గీకరణ అమలు ప్రారంభించామన్నారు. దళిత, గిరిజన, బీసీ బిడ్డలు వసతి పొందే సంక్షేమ హాస్టల్ లో గతంలో ఎప్పుడూ లేని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 200 శాతం కాస్మొటిక్ చార్జీలను, 40 శాతం మెస్ చార్జీలను పెంచింది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో రెండు వందల కోట్లతో ఇరవై ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తున్నారు. దీనితో పేద దళిత, గిరిజన, బీసీ వర్గాల పిల్లలకు కార్పోరేట్ స్థాయి విద్య అందుతుంది. ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు ఉదయం పూట అల్పాహార పథకం, ఇంటర్ మీడియట్ విద్యార్ధులకు కూడా మద్యాహ్న భోజన సౌకర్యం కల్పిస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సబ్సిడీ గ్యాస్ సిలిండర్, పేదల ఇళ్ళకు ఉచితంగా కరంటు సరఫరా, కొత్త రేషన్ కార్డులు మంజూరు, సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, డ్వాక్రా మహిళలకు ఉచితంగా రుణాలు ఇవన్ని కూడా సమాజంలో మెజారిటీగా ఉన్న సబ్బండ వర్గాల ప్రజలకు సామాజికంగా, ఆర్ధికంగా అండగా ఉంటున్నాయని, అంబేద్కర్ పోరాట స్పూర్తితో నేటి యువత తమ జీవిత లక్ష్యాలను సాదించి ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరుకుంటున్నానని, అప్పుడే వారికి మనం నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామన్నారు.
పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి దిక్కు చూపిన, కుల మతాల కతీతంగా సామాజిక న్యాయం కోసం పోరాడిన మహానుబావుడు, డాక్టర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు అయన ఆశయాలను ఆచరించి సమాజ అభివృధికి కృషి చేయాలనీ సూచించారు. ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా ఎస్ పి స్నేహ మెహ్రా, అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్, మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య, జడ్ పి సిఇఓ సుదీర్, మార్కెట్ కమిటి చైర్మెన్, వైస్ చైర్మన్ అర్ధ సుధాకర్ రెడ్డి, కౌన్సిలర్లు, ఉత్సవ కమిటి సభ్యులు రామ చందర్, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
మద్యం సేవించి వాహనాలు నడపడమే ప్రమాదాలకు కారణం-స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

వికారాబాద్‌లో ఘనంగా రెండవ రోజు ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం: రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేసిన తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, జిల్లా కల్లెక్టర్ దీపక్ తివారీ, జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ప్రజలు, ఇతర అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ కార్యక్రమం రెండో రోజుకు చేరుకుంది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, వికారాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగం రవాణా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం వికారాబాద్ పట్టణంలోని యెన్నెపల్లి చౌరస్తాలో భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తామని అధికారులతో కలిసి ప్రజలందరూ రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరు కాగా, జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. డా. బిఆర్ అంబేడ్కర్ కు నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంబించారు. ఈ సందర్బంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ రహదారి ప్రమాదాలకు మద్యం సేవించి వాహనం నడపడం ప్రధాన కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూనే, మానసిక దృఢత్వంతో బాధ్యతగా వాహనాలు నడపాలని సూచించారు.

మారుమూల ప్రాంతాల వరకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచాలి. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ బాధ్యతగా వ్యవహరించినప్పుడే ప్రమాద రహిత జిల్లా సాధ్యమవుతుంది అని స్పీకర్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీ దీపక్ తివారీ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి పౌరుడు క్రమశిక్షణతో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పిలుపునిచ్చారు. రహదారి భద్రతను మెరుగుపరిచేందుకు అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నామని, గ్రామ స్థాయిలో కూడా రోడ్డు సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేశామని తెలిపారు.
జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ, రోడ్డు భద్రతపై సామాజిక చైతన్యం తీసుకురావడంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, డ్రైవర్ల సంఘాలు స్వచ్ఛంద సంస్థలు చురుగ్గా పాల్గొనాలని కోరారు. జిల్లాలోని గత ప్రమాద గణాంకాలను పరిశీలించి, అత్యధికంగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్) గుర్తించామని, అక్కడ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. పౌరుల ప్రాణాల రక్షణే ధ్యేయంగా పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందని, ప్రమాద రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంమని ఎస్పీ స్పష్టం చేశారు.