Take a fresh look at your lifestyle.

రాజ్యాంగంపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం-అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ఎంపీ మల్లు రవి.

 

రాజ్యాంగం ముఖ్యాంశాల పేరుతో పుస్తకాల ముద్రణ.

అంబేడ్కర్ కృషితోనే అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు.

జోగులాంబ గద్వాల జిల్లా అభివృద్ధికి కృషి.

గద్వాలలో ఘనంగా అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు.

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి:

భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రాజ్యాంగంలో అణగారిన వర్గాల ప్రజలకు రిజర్వేషన్లు కల్పించడంతో విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో ఆయా వర్గాల ప్రజలకు ప్రాధాన్యత కల్పించబడిందని నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు డాక్టర్ మల్లు రవి అన్నారు.

రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ 135 వ జయంతినీ పురస్కరించుకొని మంగళవారం జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గద్వాల అంబేడ్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి ఎంపీ మల్లు రవి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముందుగా అతిధులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, పలు రాజకీయ పార్టీల, ప్రజా సంఘాల నేతలు, తదితరులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పక్కనే ఏర్పాటు చేసిన వేదిక వద్ద అంబేడ్కర్ చిత్రపటానికి పూజలు చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని సులువుగా అర్థం చేసుకోవడానికి పీఠికను ఆధారంగా చేసుకుని భారత రాజ్యాంగం ముఖ్యాంశాలు పేరుతో తాను స్వయంగా 30 వేల పుస్తకాలను ముద్రింపజేసినట్లు చెప్పారు. ప్రజలు తమ హక్కులు, బాధ్యతలను తెలుసుకునేందుకు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఇతర అంశాలు దోహదపడతాయన్నారు. సమాజంలోని అవస్థలు రూపుమాపాలంటే ప్రజల్లో ఉండి పోరాటం చేసేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉపయోగపడతాయన్నారు. రిజర్వేషన్స్ వలన ఎంతోమంది అణగారిన వర్గాల ప్రజలు ప్రజాప్రతినిధులుగా, ఉన్నతాధికారులుగా ఎదగడం జరిగిందన్నారు. అంబేడ్కర్ ఆశయాలను కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల మేలుకు వివిధ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. రాష్ట్రంలో నూతనంగా 105 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యాలయాలను స్థాపించి, అన్ని వర్గాల విద్యార్థులు అక్కడ కలిసి చదువుకునేందుకు కృషి చేస్తుందన్నారు. జిల్లాలో తరచూ విజిలెన్స్, దిశ కమిటీ, ఎన్ ఫోర్స్ మెంట్ సమావేశాలు నిర్వహించి ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి
పాటుపడతామన్నారు. డోర్నకల్ నుంచి సూర్యాపేట, నల్లగొండ, కల్వకుర్తి, నాగర్కర్నూల్, వనపర్తి మీదుగా గద్వాల వరకు రైల్వే లైన్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గద్వాల రైల్వే స్థలంలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి, జిల్లాలో ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు ప్రయత్నిస్తానన్నారు. గద్వాలలో అంబేడ్కర్ కళాభవన్ నిర్మాణానికి, నూతన విగ్రహ ఏర్పాటుకు, బాబు జగ్జీవన్ రామ్ భవన నిర్మాణానికి తన ఎంపీ నిధులను కేటాయిస్తానన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో సంక్షేమ వసతి గృహాల్లో, పాఠశాలల్లో నెలకొన్న వివిధ సమస్యల పరిష్కారానికి తన ఎంపీ నిధులను కేటాయిస్తానన్నారు. జిల్లాలో ఇతర సమస్యల పరిష్కారానికి తన వంతుగా ఎల్లవేళలా సహకారం అందిస్తానన్నారు.

జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ భారతరత్న అంబేడ్కర్ నిమ్న కులాల ప్రజల అభ్యున్నతికి ఎంతో దూరదృష్టితో రాజ్యాంగంలో వారికి రిజర్వేషన్లు కల్పించడం జరిగిందని, ఆయన తన జీవితాంతం అందరికీ స్వేచ్ఛ, సమానత్వాల కోసం కృషి చేశారన్నారు. రాజ్యాంగంతో భారతదేశం గణతంత్ర, లౌకిక, ప్రజాస్వామ్య దేశంగా రూపొందడమే కాక భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. శాసన, న్యాయ వ్యవస్థలతో పాటు సివిల్ సర్వీసులు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, ఇతరాత్ర చట్టాల గురించి రాజ్యాంగంలోని వివిధ ఆర్టికల్స్ ద్వారా ప్రస్తావించడం జరిగిందన్నారు. సెన్సస్ సమయంలో జిల్లా ప్రజలు సరైన సమాచారం ఇవ్వడం వలన భవిష్యత్తులో రిజర్వేషన్స్, ఇతర విషయాల్లో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేందుకు ఆస్కారమేర్పడుతుందన్నారు. జిల్లాలో ప్రతి నెల పౌర హక్కుల దినోత్సవం నిర్వహిస్తామని, ఎక్కడైనా అంటరానితనం ఉంటే తగు చర్యలు తీసుకుంటామన్నారు. భారత రాజ్యాంగం ముఖ్యాంశాలు పుస్తకాన్ని ప్రజాప్రతినిధులు, విద్యార్థులతో పాటు అన్ని వర్గాల ప్రజలు చదవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.

ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో ఏదైనా ఒక చట్టాన్ని రూపొందించడానికి ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయని, అలాంటిది భారత రాజ్యాంగాన్ని సమగ్రంగా రచించిన డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ భారతదేశంలో జన్మించడం మన అందరి అదృష్టమని కొనియాడారు. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ప్రతి పౌరుడికి సహజసిద్ధ కవచ కుండలాల వంటివని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాల్లో భాగంగా ఈనెల 13 నుంచి 18 వరకు రహదారి భద్రత వారోత్సవాలను నిర్వహిస్తున్నామని, అంబేడ్కర్ జయంతి రోజున వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన ప్రజలకు రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయిస్తున్నట్లు చెప్పారు. రహదారి ప్రమాదాల నివారణకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో గత నాలుగు నెలలుగా అర్రైవ్ అలైవ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఇతర అతిధులు, పలు రాజకీయ పార్టీల, ప్రజా సంఘాల నేతలు ప్రసంగించారు. అనంతరం డిఎస్పి మొగిలయ్య అతిధులు, కార్యక్రమానికి వచ్చిన వారందరితో రహదారి భద్రత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. అలాగే విష్ణు అనే విద్యార్థి అంబేడ్కర్ పై పాడిన పాట ఆలోచింపజేసింది.

అంతకుముందు గద్వాల ఐడిఓసి వద్ద నిర్వహించిన వేడుకల్లో అంబేడ్కర్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్లు, ఇతర అధికారులు, ప్రజా సంఘాల నేతలు పూలమాలలు వేసి పూజలు చేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, ఆర్డీవో శ్రీనివాసరావు, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి నుషిత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు, గద్వాల మున్సిపల్ చైర్ పర్సన్ జయలక్ష్మి, వైస్ చైర్మన్ శంకర్, జెడ్పి మాజీ చైర్పర్సన్ సరిత, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, డిసిసి అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల, ప్రజా సంఘాల నేతలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.