ఎస్ఐబీ ఎదుట దేవ్ జీ, ఆసిఫాబాద్ అడవుల్లో రాజిరెడ్డి
మరో 16 మంది సభ్యులు లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ
రెండు రోజుల్లో మీడియా ముందుకు అగ్రనేతలు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఆపరేషన్ కగార్ పేరిట సాయుధ బలగాల కూంబింగ్… వరుస ఎన్ కౌంటర్లతో సతమతమవుతోన్న మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి, అగ్రనేత దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతితో పాటు పొలిట్ బ్యూరో మెంబర్ మల్లా రాజిరెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయారు. గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉంటూ ఉద్యమాన్ని నడిపిస్తున్న దేవ్‌జీ, తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) అధికారుల ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటు మల్లా రాజిరెడ్డి ఆసిఫాబాద్ అడవుల్లో పోలీసులకు చిక్కారు. వీరిద్దరితో పాటు మరో 16 మంది కీలక మావోయిస్టులు సరెండర్ అయినట్టు సమాచారం. దీనిపై మరో రెండు రోజుల్లో పోలీసులు అధికారిక ప్రకటన చేస్తూ వారిని మీడియా ముందుకు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జగిత్యాల జిల్లాకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ పగ్గాలు చేపట్టారు. కేంద్ర కమిటీ సెక్రటరీగా ఉంటూ దేశవ్యాప్తంగా పార్టీ వ్యూహాలను ఆయనే రచించేవారు. అటువంటి అగ్రనేత లొంగిపోవడం పార్టీ ఉనికిని దాదాపుగా తుడిచిపెట్టినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
దేవ్ జీ… అలియాస్ తిప్పిరి తిరుపతిది జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం. ఆయన తండ్రి వెంకట్ నర్సయ్య. మాల సామాజిక వర్గానికి చెందిన అతను 1983లో మావోయిస్టు ఉద్యమంలో చేరి క్రమంగా ఉన్నత స్థానానికి ఎదిగి దక్షిణ భారత జోన్ ఆపరేటర్‌గా పనిచేశాడు. తిరుపతి పేరు జాతీయ దర్యాప్తు సంస్థ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉంది, పార్టీ లోపల అతన్ని సంజీవ్, చేతన్, రమేష్, సుదర్శన్, దేవన్న అని పిలుస్తారు. అతను పార్టీ భూగర్భ సైనిక ప్రచురణ అయిన అవామి జంగ్‌ను సవరించాడు. సెంట్రల్ మిలిటరీ కమిషన్‌లో సీనియర్ సభ్యుడిగా ఉన్నారు. దంతెవాడలో ఏప్రిల్ 2010లో జరిగిన మావోయిస్టు దాడిలో 74 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాన్ల హత్యకు తిరుపతి ప్రధాన సూత్రధారి అని పోలీసులు భావిస్తున్నారు. నంబల కేశవరావు మరణం తర్వాత , తిరుపతి సెప్టెంబర్ 2025లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
గడువుకు ముందే ఆపరేషన్ కంప్లీట్…?
మార్చి 31 నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామన్న కేంద్రం ప్రభుత్వం.. దేవ్, రాజిరెడ్డి లక్ష్యంగా ఇటీవల ఆపరేషన్ కగార్-2 చేపట్టింది. ఈ మేరకు మావో ప్రభావిత రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. సాయుధ బలగాలతో భారీగా కూంబింగ్ చేపడుతున్నది. ఇందులో భాగంగా ఇప్నటికే తెలంగాణ, ఛత్తీస్ గడ్ సరిహద్దులో ఉన్న కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ చేపట్టిన సాయుధ బలగాలు ఇప్పటికే పలువురు మావోయిస్టులను మట్టుపెట్టారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పీఎల్ జీఏ 1వ బెటాలియన్ మాస్టర్ మైండ్ మాడ్వి హిడ్మా గతేడాది నవంబర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. ఆంధ్రప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇటీవల మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఉన్న పాక హనుమంతు సైతం ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. సుదీర్ఘ కాలం పాటు అండర్‌గ్రౌండ్‌లో ఉన్న బర్సే దేవా మరికొందరు కీలక మావోయిస్టులు కూడా హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. మరోవైపు కొద్ది నెలల క్రితం 200 మందికి పైగా మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్ సీఎం, హోం మంత్రి ముందు లొంగిపోయారు. వీరిలో 98 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న మాడ్ డివిజన్ కార్యదర్శి రనిత కూడా లొంగిపోయారు. మహారాష్ట్ర సీఎం ఎదుట కూడా వందల సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో తెలంగాణకు చెందిన 15 మంది ఉన్నారు. వీరిలో కేంద్ర కమిటీలో ఇద్దరు, రాష్ట్ర కమిటీలో ఐదుగురు, డివిజన్ కమిటీలో ఆరుగురు, అండర్‌గ్రౌండ్‌లో ఒకరితో పాటు మరొకరు ఉద్యమంలో కొనసాగుతున్నట్లు ఇటీవల డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు.