Take a fresh look at your lifestyle.

ప్రజానాట్యండలి జిల్లా 8వ మహాసభలను జయప్రదం చేయండి-ప్రజానాట్యమండలి,జిల్లా కమిటీ సభ్యుడు జిట్ట స్వామి

 

ముద్ర, చిట్యాల మండలం (వనిపాకల):


ప్రజల్లో చైతన్యం నింపే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రజానాట్యమండలి జిల్లా 8వ మహాసభలను విజయవంతం చేయాలని ప్రజానాట్యమండలి జిల్లా కమిటీ సభ్యుడు జిట్ట స్వామి పిలుపునిచ్చారు. శనివారం చిట్యాల మండలం వనిపాకల గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ— దశాబ్దాలుగా ప్రజా చైతన్యానికి వేదికగా నిలుస్తున్న ప్రజానాట్యమండలి “కలకలం కోసం కాదు, కల ప్రగతి కోసం” అనే నినాదంతో ముందుకు సాగుతోందన్నారు. వీధి నాటకాలను పోరాట ఆయుధాలుగా మలచుకొని సామాజిక సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచుతూ నిరంతరం కళా ప్రస్థానాన్ని కొనసాగిస్తోందని తెలిపారు.

సామాజిక చైతన్యం అవసరాన్ని వివరిస్తూ సినారె చెప్పిన “నీటికి చలం ఉంటేనే వరద వస్తుంది, నిప్పుకు జ్వలనం ఉంటేనే మంట వస్తుంది” అన్న మాటలను ఉటంకించారు. ప్రకృతి గాని, సమాజం గాని అభివృద్ధి చెందాలంటే చైతన్యం కీలకమని, అదే పురోగమనానికి పునాది అని పేర్కొన్నారు.

82 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రజానాట్యమండలి ప్రజల జీవన విధానంలో విడదీయరాని భాగమై, జానపద కళల ద్వారా సమాజాన్ని చైతన్యపరుస్తోందన్నారు. ప్రపంచీకరణ ప్రభావంతో గ్రామీణ జానపద కళలు, మానవ సంబంధాలు క్రమంగా తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

వీర తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని కలిగిన నల్లగొండ జిల్లాలో ఏప్రిల్ 6, 7 తేదీల్లో జిల్లా 8వ మహాసభలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మహాసభలను విజయవంతం చేసేందుకు అభ్యుదయవాదులు, మేధావులు, ప్రజలు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి చిట్యాల మండల అధ్యక్షులు మేడి లింగస్వామి, మేడి సునీత, మేడి రాణి, వేడి గోపమ్మ, భద్రం, ఐలమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.