ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి:
ద్రోణి ప్రభావంతో జోగుళాంబ గద్వాల జిల్లాలో మంగళ వారం రాత్రి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా, మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు, తేలికపాటి వడగండ్లతో కూడిన వర్షం కురిసింది.

మంగళవారం రాత్రి జిల్లాలోని పలు మండలాలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసింది. మామిడి తోటలు దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈదురుగాలులతో కూడిన వర్షంతో కొన్నిచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. గట్టు మండలంలో వడగండ్లు కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చేతికొచ్చిన మొక్కజొన్న, వరి, మామిడి పంటలకు కూడా కొంత నష్టం వాటిల్లినట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలి దుమారం కారణంగా విద్యుత్ సరఫరా అంతరాయం కలిగింది. పలు గ్రామాల్లో కరెంటు సమస్యలు తలెత్తాయి. రాత్రి వేళల్లో చీకట్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చేతికి వచ్చిన వరి, మామిడి, మిర్చి తోటలు ఈదురుగాలలు ధాటికి దెబ్బతిన్నాయి. ఇప్పటికే పలు కొనుగోలు కేంద్రాల్లో పోసిన మొక్క జొన్న ఈ వర్షానికి తడిసిముద్దయింది. ముందస్తు హెచ్చరిక లేకపోవడంతో ఇటుక బట్టీ వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. కాల్చడానికి సిద్ధంగా ఉన్న ఇటుక రాళ్లు వర్షానికి పనికిరాకుండా పోయాయని, ఒక్క రాత్రిలోనే లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.