Take a fresh look at your lifestyle.

జడ్జీల పేర్లతో ఐపీఎల్ టికెట్ల దందా.. ఉప్పల్‌లో ముఠా అరెస్ట్

 

మల్కాజ్గిరి ముద్ర

ఐపీఎల్ టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తూ, ప్రముఖుల పేర్లతో ఫోర్జరీకి పాల్పడిన ముఠాను ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. దేశంలోని ఉన్నత పదవుల్లో ఉన్న మంత్రులు, జడ్జీలు, గవర్నర్ల పేర్లను దుర్వినియోగం చేసి వీవీఐపీ కోటా టికెట్లు పొందిన వ్యవహారం వెలుగులోకి రావడం సంచలనం కలిగించింది.
మే 3న ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులకు, స్టేడియం పార్కింగ్ ప్రాంతంలో టికెట్లు బ్లాక్‌లో విక్రయిస్తున్నారనే సమాచారం అందింది. వెంటనే ఉప్పల్ ఎస్‌ఐ ఏ. మాధవరెడ్డి బృందం అక్కడికి చేరుకుని అనుమానాస్పదంగా ఉన్న మహీంద్రా థార్ వాహనం (ఏపీ-40 బీబీ-6768)ను తనిఖీ చేసింది.
విచారణలో నిందితులు గూగుల్ ద్వారా ప్రముఖుల అధికారిక లెటర్ హెడ్‌లను డౌన్‌లోడ్ చేసి, వాటిపై మంత్రులు, జడ్జీలు, గవర్నర్ల సంతకాలను ఫోర్జరీ చేసినట్లు తేలింది. అనంతరం హైదరాబాద్, తమిళనాడు, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్లకు ఆ లేఖలను సమర్పించి వీవీఐపీ కోటాలో ఖరీదైన కాంప్లిమెంటరీ టికెట్లు పొందారు. తర్వాత ఆ టికెట్లను అవసరమున్న వారికి అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమంగా లాభాలు ఆర్జిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ కేసులో గట్టమనేని అశోక్, కంకనాల దినేష్, సింగమనేని వేణుమాధవ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు రియల్ ఎస్టేట్ వ్యాపారి కాగా, ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వీరంతా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా పల్కూరు గ్రామానికి చెందినవారని పోలీసులు తెలిపారు.
ఇక చెన్నైకి చెందిన ఆశిష్, సెంథిల్, తాన్సిల్ అనే మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
నిందితుల వద్ద నుంచి రూ.1.10 లక్షల విలువైన ఐపీఎల్ టికెట్లు (తలా రూ.22 వేల విలువ గల 5 టికెట్లు), మహీంద్రా థార్ వాహనం, ఐదు మొబైల్ ఫోన్లు, ఐదు ఫోర్జరీ చేసిన లెటర్ హెడ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి పర్యవేక్షణలో, ఉప్పల్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ఉప్పల్ పోలీసులు, ఎస్‌ఓటీ బృందం ఈ ఆపరేషన్ నిర్వహించింది. అరెస్టు చేసిన నిందితులను సోమవారం కోర్టులో హాజరుపరిచారు.

Leave A Reply

Your email address will not be published.