Take a fresh look at your lifestyle.

జిల్లాలో రబీ వరి కొనుగోలు ఏర్పాట్లు పక్కాగా చేయాలి: కలెక్టర్ బాదావత్ సంతోష్

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్

నాగర్ కర్నూల్: రాబోయే రబీ సీజన్‌కు వరి కొనుగోలు ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని, ఎక్కడైనా అలసత్వం లేదా నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ హెచ్చరించారు.

శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ భవనంలో సన్నాహక సమావేశం, శిక్షణ కార్యక్రమం నిర్వహించి రబీ 2025–26 సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లపై విస్తృత సమీక్ష చేశారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ, సహకార, గ్రామీణాభివృద్ధి, మార్కెటింగ్, రవాణా, లీగల్ మెట్రాలజీ, సివిల్ సప్లైస్ శాఖల అధికారులు, డీసీఓల సీఈఓలు, ఏపీఎంలు, మండల వ్యవసాయ అధికారులు, రవాణా కాంట్రాక్టర్లు, రైస్ మిల్లుల ప్రతినిధులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ అమరేందర్ కూడా హాజరయ్యారు.

జిల్లాలో రబీ సీజన్‌లో సుమారు 1,87,418 ఎకరాల్లో సాగు జరిగి, దాదాపు 1.20 లక్షల మంది రైతుల నుంచి 4,44,033 మెట్రిక్ టన్నుల వరి దిగుబడి వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసిందని కలెక్టర్ తెలిపారు. రైతులు తమ పంటకు న్యాయమైన ధర పొందేలా కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ప్రకారం సాధారణ రకం వరికి ₹2,369, ఏ-గ్రేడ్ వరికి ₹2,389 చెల్లించాలని, అదనంగా క్వింటాల్‌కు ₹500 బోనస్ రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తూ ప్రతి సెక్టార్‌కు కనీసం 25 లారీలను ఏర్పాటు చేయాలని, కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్లకు ఆదేశించారు. వాహనాల కొరత కారణంగా ఆలస్యం జరిగితే సంబంధిత కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే బ్లాక్‌లిస్ట్‌లో చేర్చుతామని హెచ్చరించారు.

కొనుగోలు కేంద్రాల్లో తూకం, నమోదు ప్రక్రియ వేగవంతంగా జరగేలా చూడాలని, రైతులు వచ్చిన వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలని సూచించారు. గిడ్డంగులు సిద్ధంగా ఉంచి, ధాన్యం నాణ్యత కాపాడే చర్యలు తీసుకోవాలని, రైస్ మిల్లులు సమయానికి మిల్లింగ్ పూర్తి చేయాలని తెలిపారు.

తీవ్ర ఎండల నేపథ్యంలో రైతులకు త్రాగునీరు, నీడ, కూర్చునే సౌకర్యాలు, ఫ్యాన్లు, అవసరమైతే తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి కేంద్రంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, అవసరమైతే వైద్య శిబిరాలు కూడా నిర్వహించాలని సూచించారు.

అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకుని తార్పాలిన్ కవర్లు సిద్ధంగా ఉంచాలని, గన్నీ బ్యాగులు తగిన మోతాదులో నిల్వ ఉంచాలని పేర్కొన్నారు. కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

ఎలాంటి నిర్లక్ష్యం, ఆలస్యం చోటుచేసుకున్నా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.