Take a fresh look at your lifestyle.

ధాన్యానికి గిట్టుబాటు ధర అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది.. వడ్ల కొనుగోలు కేంద్రాలని ప్రారంభించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

ముద్ర, వలిగొండ : రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం వలిగొండ మండలంలోని పహిల్వాన్‌పురం, మాందాపురం, నాతాళ్ళగూడెం, అక్కంపల్లి, లింగరాజుపల్లి గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ పంటను విక్రయించుకునే విధంగా కొనుగోలు కేంద్రాల నిర్వహణలో అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి రైతుకు న్యాయం జరిగేలా పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. గత సంవత్సరంలో సుమారు 3 లక్షల 77 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు ఈ సంవత్సరం సుమారు 4 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించుకున్నామని తెలిపారు.

రైతులకు మరింత ప్రోత్సాహం అందించేందుకు వడ్లపై క్వింటాల్‌కు ₹500 బోనస్ అందిస్తున్నామని వెల్లడించారు. రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుందని అన్నారు. కొనుగోలు కేంద్రాలలో గన్నీ బ్యాగులు, తూకం యంత్రాలు, మాయిశ్చర్ మీటర్లు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని, ధాన్యం తేమ శాతం పరీక్షలు సక్రమంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. రైతులు కేంద్రాలకు తీసుకువచ్చే ధాన్యాన్ని ఆలస్యం లేకుండా వెంటనే కొనుగోలు చేసి, చెల్లింపులు సమయానికి జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కేంద్రాల వద్ద తాగునీరు, ఇతర కనీస సదుపాయాలు కల్పించాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపారు. రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, మండల, గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, ఐకేపీ ప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కార్యాలయం, కవరింగ్ షెడ్డులను ప్రారంభించిన ఎమ్మెల్యే మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన మార్కెట్ కమిటీ చైర్మన్ కార్యాలయం, కవరింగ్ షెడ్డులను ఎమ్మెల్యే ప్రారంభించారు.
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ & సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వలిగొండ మండలంలో నిర్వహించిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మరియు సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణి కార్యక్రమంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి 56 మంది లబ్ధిదారులకు రూ. 19,69,500/- విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. రూ. 76,08,816/- విలువ గల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని ప్రధానంగా తీసుకొని అమలు చేస్తున్న పథకాలు పేద కుటుంబాలకు ఎంతో అండగా నిలుస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సమయంలో ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని, అలాగే అత్యవసర పరిస్థితుల్లో సిఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందించడం ప్రజలకు ఉపశమనం కలిగిస్తోందని పేర్కొన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచులు, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.