ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలోని “పోలీస్ అక్క” (నారిశక్తి) కార్యక్రమం జాతీయ స్థాయి స్కోచ్ అవార్డు సాధించిన నేపథ్యంలో ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఎస్పీ డా.జి.జానకి షర్మిల హాజరై, పోలీస్ అక్క లతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. పోలీస్ అక్క కార్యక్రమం మహిళా పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో నడిచే కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమం. ఇందులో భాగంగా బాలికలకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, మహిళల భద్రత, సైబర్ సెక్యూరిటీ, పోక్సో చట్టం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో పెట్రోలింగ్, డయల్-100 ద్వారా అత్యవసర సేవలు అందిస్తున్నారు. పోలీస్ అక్కలు కె జీ బి వి పాఠశాలల్లో నెలకోసారి రాత్రి బస చేసి విద్యార్థినుల సమస్యలు విని, కౌన్సిలింగ్ అందిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 7,000 మంది విద్యార్థినులు, మహిళలు నేరుగా ప్రయోజనం పొందారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మహిళా పోలీస్ సిబ్బందిని ఎస్పీ జానకి షర్మిల అభినందించారు.