విద్యార్థుల భద్రతే లక్ష్యం
ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:
జిల్లాలో స్కూల్ బస్సుల భద్రతపై రవాణా శాఖ కఠిన చర్యలు చేపట్టింది. ఫిట్నెస్ సర్టిఫికేట్ లేని బస్సులను ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్డుపై నడపనివ్వబోమని డీటీఓ బాలు నాయక్ హెచ్చరించారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడే యాజమాన్యాలను ఉపేక్షించబోమన్నారు.
జిల్లాలో ప్రస్తుతం 190 స్కూల్ బస్సులు ఉండగా, సోమవారం 54 బస్సులు ఫిట్నెస్ పరీక్షలకు హాజరయ్యాయని తెలిపారు. ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధించడంతో పాటు బస్సులను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
డ్రైవర్లకు హెవీ లైసెన్స్‌తో పాటు కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలని, 60 ఏళ్లలోపు వారికే అనుమతి ఉంటుందని తెలిపారు. డ్రైవర్లకు మెడికల్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలని, ప్రతి నెల బీపీ, షుగర్, కంటి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. డ్రైవర్లు యూనిఫామ్ ధరించాలని సూచించారు.
15 ఏళ్లు దాటిన బస్సులను స్క్రాప్ చేయాలని, కాలం చెల్లిన వాహనాలతో విద్యార్థుల రవాణా పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. సిటింగ్ సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కించరాదని హెచ్చరించారు. స్కూల్ బస్సులను ప్రైవేట్ పనులకు వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ప్రతి బస్సులో ఫస్ట్ ఎయిడ్ కిట్, అగ్నిమాపక పరికరాలు, సేఫ్టీ గ్రిల్స్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. బస్సు మెట్లు విద్యార్థులకు అనుకూలంగా ఉండాలని సూచించారు. పసుపు రంగు బస్సులను మాత్రమే నడపాలని, నాలుగు వైపులా పార్కింగ్ లైట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
బస్సుపై పాఠశాల పేరు, పూర్తి చిరునామా స్పష్టంగా రాయాలని, విద్యార్థుల వివరాలు మరియు సీటింగ్ నంబర్లు డ్రైవర్ వద్ద తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. రోడ్డు భద్రత అవగాహన సదస్సులకు డ్రైవర్లు, క్లీనర్లు హాజరు కావాలని సూచించారు. ప్రతి నెల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని పాఠశాల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు.