Take a fresh look at your lifestyle.

పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా…

బక్రీద్ నేపథ్యంలో జిల్లా సరిహద్దుల్లో విస్తృత తనిఖీలు…
జిల్లా సరిహద్దు చెక్‌పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్….

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:

రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతలు భద్రంగా కొనసాగేందుకు, పశువుల అక్రమ రవాణా, గోవధ నివారణ పై ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఎలాంటి అక్రమ కార్యకలాపాలకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా సరిహద్దులో ఏర్పాటు చేసిన రాయపట్నం, రాజారాం పల్లె, చిల్వకోడూర్ చెక్‌పోస్టును జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల సమయంలో విధుల్లో ఉన్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లాలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ముఖ్యంగా పశువులను తరలిస్తున్న వాహనాల పత్రాలను పూర్తిగా పరిశీలించాలని ఆదేశించారు. ప్రతి వాహనానికి సంబంధించిన వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. పశువులను అక్రమంగా తరలించే వాహనాల తనిఖీల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించకూడదని, అనుమానాస్పదంగా సంచరించే వాహనాలు, వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని, రాత్రి వేళల్లో మరింత అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. అక్రమంగా గోవులను రవాణా చేస్తున్నారనే పేరుతో కొందరు వ్యక్తులు లేదా సంఘాలు బృందాలుగా ఏర్పడి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం, అల్లర్లు సృష్టించడం వంటి చర్యలకు పాల్పడే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. చట్టాన్ని అమలు చేసే బాధ్యత పూర్తిగా పోలీసు శాఖదేనని, ఎవరూ స్వచ్ఛందంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని అన్నారు. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలనైనా ఉపేక్షించబోమని, ప్రజలు కూడా పోలీస్ శాఖకు సహకరించి అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా, డయల్ 100 కు సమాచారం అందించాలని కోరారు.
ఇందులో ఎస్పి వెంట డిఎస్పి పురుషోత్తం రెడ్డి, ధర్మపురి సి.ఐ రామ్ నరసింహ రెడ్డి, ఎస్. ఐ లు మహేష్, ఉదయ్ కుమార్, కృష్ణ సాగర్, సిబ్బంది ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.