బసవేశ్వర జయంతి సందర్భంగా నాగర్ కర్నూల్‌లో ఘన నివాళులు
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
వందల సంవత్సరాల క్రితమే కుల, వర్ణ, లింగ వివక్షలకు వ్యతిరేకంగా పోరాడి సర్వమానవ సమానత్వాన్ని చాటిచెప్పిన మహనీయుడు మహాత్మా బసవేశ్వరుడని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి పేర్కొన్నారు.
బసవేశ్వరుడి జయంతి సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి పాల్గొని బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సాంప్రదాయక సమాజంలో ఉన్న కుల, మత భేదాలకు వ్యతిరేకంగా పోరాడిన అభ్యుదయవాది బసవేశ్వరుడని తెలిపారు. ఆయన బోధించిన మానవతా విలువలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. బసవేశ్వరుడి సిద్ధాంతాలను కేవలం మాటల్లో కాకుండా జీవితాల్లో ఆచరణలో పెట్టినప్పుడే నిజమైన నివాళి అర్పించినట్టవుతుందని అన్నారు.
అలాగే బసవేశ్వరుడు 12వ శతాబ్దంలోనే మహిళలకు సముచిత స్థానం కల్పించి సమానత్వానికి మార్గదర్శకుడిగా నిలిచారని తెలిపారు. ఆయన బోధించిన అభ్యుదయ భావజాలమే నేటి లింగాయత్ ధర్మంగా మారిందని వివరించారు.
ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ, మూఢనమ్మకాలపై నిరంతరం పోరాటం చేసిన గొప్ప సంఘ సంస్కర్త బసవేశ్వరుడని అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చూపిన మార్గం ప్రేరణనిస్తోందని పేర్కొన్నారు. సమాజ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బసవేశ్వరుని మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా లింగాయత్ సంఘ నాయకులు పట్టణంలో బసవేశ్వరుని విగ్రహం, బసవేశ్వర భవనం ఏర్పాటు చేయాలని కోరగా, ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి త్వరలోనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి శ్రీరాములు, జిల్లా గౌరవ అధ్యక్షుడు జెమిని సురేష్, జిల్లా అధ్యక్షుడు గిరిజ శంకర్, కార్యదర్శి రాజేష్, మమ్మాయిపల్లి రాజు, మహదేవన్పేట రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.