Take a fresh look at your lifestyle.

కవితతోనే కష్టం- ఫోన్ ట్యాపింగ్ లో బీఆర్ఎస్ అంతర్మథనం

కవితతోనే కష్టం
ఫోన్ ట్యాపింగ్ లో బీఆర్ఎస్ అంతర్మథనం
కవితకు నోటీసులు ఇచ్చే ఛాన్స్
విచారణకు వెళ్తే గండమే
హరీష్, సంతోష్ పాత్ర వివరిస్తారని భయం
ఇప్పటికే ఈ కేసుపై బహిరంగ విమర్శలు
తన భర్త ఫోన్ ట్యాప్ చేశారన్న కవిత

ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఫోన్ ట్యాపింగ్ కేసులో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న బీఆర్ఎస్ కు ఇప్పుడు అసలు సిసలు భయం పట్టుకున్నది. ఓ వైపు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది. ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జోగినపల్లి సంతోష్ రావులకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేసి.. విచారణకు పిలిచింది. విచారణకు కూడా హాజరయ్యారు. ప్రస్తుత పరిణామాల్లో కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంపీగా, ఎమ్మెల్సీగా ఉన్న కల్వకుంట్ల కవితకు కూడా నోటీసులు ఇస్తారని తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో ఆమెకు సిట్ నోటీసులు అందే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని పెంచుతోంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పై కవిత తిరుగుబాటు చేస్తోంది. కేసీఆర్ మినహా.. కీలక నేతలందరిపైనా విమర్శలు చేస్తోంది. అంతేకాదు.. గతంలో తన భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారంటూ ఆరోపణలు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కవిత సిట్ విచారణకు హాజరైతే.. తమకు కొంత ఇబ్బందే అంటూ బీఆర్ఎస్ నేతల్లో భయం పట్టుకున్నట్లు చెబుతున్నారు.

విచారణలో కవిత వైఖరి ఏంటి..?
త్వరలోనే కవితకు సిట్ నోటీసులు వస్తాయని ప్రచారం. ఒకవేళ కవితకు నోటీసులు జారీ అయితే ఆమె సిట్ ఎదుట ఏ విధంగా స్పందిస్తారన్నది కీలకంగా మారింది. ముఖ్యంగా గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలు, సొంత సోదరుడిపై చేసిన ఆరోపణలు ఇప్పుడు మళ్లీ చర్చకు వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఆమె వద్ద ఉన్న సమాచారం ఏమిటి? విచారణలో ఆమె ఎలాంటి విషయాలు వెల్లడిస్తారు? అన్న ప్రశ్నలు రాజకీయ విశ్లేషకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ అంశం బీఆర్ఎస్ పార్టీ అంతర్గత రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారం రేపింది. ఇప్పుడు కవితకు నోటీసుల అంశం తెరపైకి రావడంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ కేసు ఎటువైపు దారి తీస్తుందన్నది, తెలంగాణ రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రభావం చూపే అంశంగా మారింది.

ఇంకా ఎవరెవరు..?
ఇప్పుడు బీఆర్ఎస్ కీలక నేతలైన హరీశ్‌రావు, కేటీఆర్‌ సహా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సంతోష్ ను విచారణకు పిలిచారు. దీంతో ఇంకా ఎవరెవరికి నోటీసులు ఇస్తారనే డౌట్స్ మొదలయ్యాయి. త్వరలో మాజీ సీఎం, గులాబీ బాస్‌ కేసీఆర్‌కు కూడా సిట్ నోటీసులు ఇవ్వబోతుందంటున్నారు. అంతకు ముందు మాజీ ఎమ్మెల్సీ కవితకు సిట్‌ నుంచి పిలుపు రానుందని..ఆమె వాంగ్మూలం రికార్డు చేస్తారని అంటన్నారు. ఆమె స్టేట్‌మెంట్‌ ఆధారంగా..మిగతా అధికారులు ఇచ్చిన వివరాలను బేస్ చేసుకుని..కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చి సిట్ విచారించే అవకాశం ఉందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామాను ఆమోదించాలని శాసనమండలి ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేసిన సందర్భంగా ఇంటల్లుడి ఫోన్‌ను కూడా ట్యాపింగ్ చేస్తారా?.. కేటీఆర్ భార్య ఫోన్‌ను కూడా ట్యాపింగ్ చేస్తే ఆయన ఊరుకుండేవారా? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయాలని కోరారు. సిట్ ముందు హాజరై వివరాలను అందజేస్తానని కూడా చెప్పారు. ఆమె ఈ కామెంట్లు చేసిన తర్వాతే ప్రభుత్వం సజ్జనార్ ఆధ్వర్యంలో పది మందితో సిట్‌ను ఏర్పాటు చేసింది. ఫోన్ ట్యాపింగ్‌పై కామెంట్లు చేసినందున తగిన ఆధారాలు ఇవ్వాల్సిందిగా ఆమెకు నోటీసులు జారీచేసి ఎంక్వైరీకి పిలిచే అవకాశముందన్న టాక్ వినిపిస్తోంది.

సిట్‌పైనే బీఆర్ఎస్‌ అటాక్
మరోవైపు బీఆర్ఎస్‌ సిట్‌పైనే అటాక్ చేసింది. రాజకీయ వికృత క్రీడ కోసం రేవంత్ వ్యవస్థను దిగజారుస్తున్నారని మండిపడుతున్నారు. సజ్జనార్‌ను సిట్ చీఫ్‌గా నియమించడంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సజ్జనార్‌పై 7 కేసులు ఉన్నాయి. ఆయనకు, డీజీపీ శివధర్ రెడ్డికి ఈ కేసు విచారించే నైతిక హక్కు లేదన్నారు. లోతైన విచారణ జరిగితే సజ్జనార్‌పైనే జరగాలనే మాటను తెరపైకి తెచ్చారు. ఫోన్ ట్యాపింగ్ పేరుతో లేనిపోని లింకులు పెడుతున్నారని, లీడర్లకు ట్యాపింగ్‌తో ఎలాంటి సంబంధం లేదని..రేవంత్ రాజకీయ క్రీడలో పోలీసులు బలికావొద్దని హెచ్చరించారు. కుట్రపూరితంగా, ఉద్దేశపూర్వకంగా తమపై కేసులు పెట్టారని హరీశ్‌ అటాక్ స్టార్ట్ చేశారు. కావాలనే రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న అధికారులతో సిట్ వేసి తమ మీద ప్రయోగాలు చేస్తున్నారని ఫైరవుతున్నారు. అన్యాయంగా, అక్రమంగా వ్యవహరిస్తే, ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే అధికారులెవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. చట్టాన్ని అతిక్రమించినా, న్యాయబద్ధంగా వ్యవహరించకపోయినా, తప్పుడు లీకులు ఇచ్చినా ఆ పోలీసులను వదిలిపెట్టే ముచ్చటే లేదని తేల్చి చెబుతున్నారు. అంతకు అంత అనుభవిస్తారు..జాగ్రత్తగా బిహేవ్ చేయాలని సూచించారు. రిటైర్ అయినా మిమ్మల్ని వదిలిపెట్టమని..ఎక్కడ దాక్కున్నా, సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకొచ్చి విచారిస్తామని హెచ్చరించారు. అయితే సిట్‌పై బీఆర్ఎస్‌ విమర్శలకు దిగడం ఆసక్తికర చర్చకు దారితీసింది. సిట్ విచారణ తర్వాత లీకులు..మీడియాలో ఇష్టం వచ్చిన ప్రచారం జరగడంపై ఫైర్ అవుతున్నారు గులాబీ లీడర్లు. నెక్స్ట్‌ సిట్‌ నుంచి పిలుపు వచ్చేదెవరికి.? కవిత వాంగ్మూలం రికార్డు చేస్తారా లేదా.? అరెస్టుల పర్వం కూడా స్టార్ట్ కానుందా.? అనేది వేచి చూడాలి

Leave A Reply

Your email address will not be published.