Take a fresh look at your lifestyle.

ప్రాజెక్టుల భూసేకరణకు రూ.5వేల కోట్లు, సింగూర్ భద్రతకు మంత్రి ఉత్తమ్ ప్రత్యేక దృష్టి

జూన్ 2 నాటికి అన్ని ప్రాజెక్టుల భూసేకరణ పూర్తి
సింగూర్ భద్రతకు తొలి ప్రాధాన్యత
సింగూర్ పునరుద్ధరణ విషయంలో ఎటువంటి రాజీపడ
పాలెం వాగు ప్రాజెక్ట్ గేట్లు,రెగ్యులేటర్ సమస్యలను పరిష్కరిస్తా
ప్రాజెక్ట్ పరిస్థితిని క్షేత్రస్థాయిలో వెళ్లి సమీక్షించండి
ఇరిగేషన్ అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు

ముద్ర, తెలంగాణ బ్యూరో :

రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాలకు అవసరమైన భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5వేల కోట్ల నిధులు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ ఏడాది జూన్ 2 వరకు భూసేకరణ పూర్తి చేసి… నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రధానంగా
హైరాబాద్‌ మహానగరానికి ప్రాణాధారంగా నిలిచిన సింగూర్ ప్రాజెక్టు పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటుందనిమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సింగూర్ డ్యామ్ భద్రత తమ ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యమన్న ఆయన మంత్రి.. స్వయంగా తాను సింగూర్ ప్రాజెక్టును సందర్శించి పరిస్థితిని పూర్తిస్థాయిలో సమీక్షిస్తానని ప్రకటించారు. బుధవారం ఉదయం సహచర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సితక్క, వివేక్ వెంకటస్వామి లతో కలిసి రాష్ట్ర సచివాలయంలో ఆయన నీటిపారుదల శాఖా ఇంజినీర్లతో ఉన్నత స్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జంటనగరాలకు తాగునీటిని సరఫరా చేస్తూ, పరిసర ప్రాంతాలకు సాగునీరూ అందిస్తున్న సింగూర్ ప్రాజెక్టును పరిరక్షించడంతో పాటు పునరుద్ధరణ విషయంలో ఎటువంటి రాజీ ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. జాతీయ ఆనకట్ట భద్రతా సంస్థతో పాటు, రాష్ట్ర అధికారుల నుంచి భద్రతా పరిస్థితిపై హెచ్చరికలు వచ్చాయన్నారు. ప్రమాదాలను నివారించేందుకు తక్షణ సాంకేతిక జోక్యాలు, నీటిమట్టం దిగువన అండర్‌వాటర్ పరిశీలనలు, మరమ్మత్తు పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లాలో ఉన్న సింగూర్ డ్యామ్ (ఎం. బాగా రెడ్డి సింగూర్ ప్రాజెక్టు)పై 2025 మధ్యకాలం నుండే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన తెలిపారు. ఆ సమయంలో నిర్వహించిన అంచనాల్లో ఎంబాంక్మెంట్‌లో చీలికలు, స్లోప్ ఎరోషన్, రివెట్‌మెంట్ నష్టం, ప్లంజ్ పూల్ సమస్యలు వెలుగులోకి వచ్చాయన్నారు. ఇవి దిగువ ప్రాంతాల్లో వరద ముప్పుకు దారితీసే అవకాశాలపై ఆందోళనలు రేకెత్తించాయని చెప్పారు. 29.91 టీఎంసీల స్థూల సామర్థ్యం ఉన్న ఈ రిజర్వాయర్ ప్రతీ సంవత్సరం హైదరాబాద్‌కు 6–7 టీఎంసీల నీటిని సరఫరా చేస్తోందని ఆయన తెలిపారు. బండ్ దిగువన నీటిని పూర్తిగా వదలకుండా దాగి ఉన్న నష్టాలను గుర్తించేందుకు సోనార్ పరీక్షలు, అండర్‌వాటర్ సర్వేలు చేపట్టి 2–3 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. త్వరలోనే స్వయంగా ఆనకట్టను సందర్శిస్తానని ప్రకటించిన ఆయన, ఒకే సీజన్‌లో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు, పంటల విరామం రాకుండా చూడాలన్నారు. ఇదే సమయంలో సింగూర్ కాలువ లైనింగ్ పనుల పురోగతిని కూడా మంత్రి సమీక్షించారు. మొత్తం 13 కి.మీ.లో 9 కి.మీ. పూర్తయ్యాయి; మిగిలిన 4 కి.మీ.ను అత్యవసరంగా పూర్తి చేయాలని ఆదేశించారు. 2025 ఆగస్టులో నిల్వలను భద్ర పరిమితులకు కట్టడి చేసి, నియంత్రిత నీటి విడుదలలు ప్రారంభించినప్పుడు ఆనకట్టపై ముప్పు స్థాయి పెరిగిందనీ డిసెంబర్ నాటికి దశలవారీగా నీటిమట్టాన్ని తగ్గించి ప్రధాన మరమ్మత్తులు చేపట్టినట్లు మంత్రి వివరించారు. ములుగు జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు. పాలెం వాగు గేట్లు,రెగ్యులేటర్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. పాలెంవాగు పరిస్థితిని క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి నివేదికను సమర్పించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.