- మార్చి 5 నుండి పరీక్షలు ప్రారంభం
- రంగారెడ్డి జిల్లా నుండి 185 పరీక్షా కేంద్రాల్లో ఫస్టియర్ లో 77,863 మంది, సెకండ్ ఇయర్లో 69,348 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు
- జిల్లా రెవెన్యూ అధికారి సంగీత
ముద్ర ప్రతినిధి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా : మార్చి 5వ తేదీ నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తునట్లు రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి సంగీత తెలిపారు.శుక్రవారం ఇంటర్మీడియట్ పరీక్షలపై, జిల్లా కలెక్టర్ల తో, సంబంధిత శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి లోటుపాట్లు తలెత్తకుండా పక్కాగా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న డిఆర్ఓ సంగీత మాట్లాడుతూ మార్చి 5వ తేదీ నుండి ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.జిల్లాలో 185 పరీక్షా కేంద్రాల ద్వారా 77,863 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 69,348 మంది రెండవ సంవత్సరం విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, 31 ప్రశ్న పత్రాల స్టోరేజ్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్, పరీక్షా సమయంలో జీరాక్స్ సెంటర్లు మూసి వేసేలా చర్యలు చేపడతామని తెలిపారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు హాజరయ్యేలా ఆర్టీసీ అధికారులు బస్సులను నడపేలా, పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్స్,ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులతో మెడికల్ పాయింట్ ఏర్పాటు చేసి సిబ్బంది కేంద్రాల వద్ద అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.ఈ సమావేశంలో కందుకూర్ ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్ రెడ్డి, చేవెళ్ళ ఆర్డీఓ చంద్రకళ, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంక్యా నాయక్, విద్యాశాఖ అధికారి సుసిందర్ రావు, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ అధికారులు, పోస్టల్ శాఖ అధికారులు, ఆర్టీసీ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, మెడికల్ అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.