అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలపై రాకేశ్ రెడ్డి సెటైర్లు
ఆ సారాకు ఇందిరమ్మ పేరు పెట్టొద్దని వ్యాఖ్య
రాకేశ్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రులు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఇప్ప సారా అంశంపై అసెంబ్లీలో చర్చ అధికార, విపక్ష పార్టీ సభ్యుల మధ్య రచ్చకెక్కింది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇప్ప పువ్వు సారాపై బుధవారం అసెంబ్లీలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తెలంగాణలోని ఆదివాసీలు, ఎస్టీ సోదరులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇప్ప పువ్వు సారా తయారీకి ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులను దేశ విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయం సమకూరుతుందని వివరించారు. గిరిజనులకు మెరుగైన ఉపాధి లభిస్తుందని అన్నారు. అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి సెటైర్లు వేశారు. ఇప్ప సారా అంశం ప్రభుత్వానికి నవ్వులాటగా ఉందన్నారు. ఆ ఉత్పత్తి ద్వారా 130 దేశాల్లో ఆదాయం వస్తుందని అనిరుధ్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒకవేళ ప్రభుత్వం ఇప్ప సారా తయారు చేస్తే, దానికి ఇందిరమ్మ పేరు మాత్రం పెట్టవద్దని సెటైర్లు వేశారు. రాకేశ్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏం తమాషాగా ఉందా రాకేశ్ రెడ్డి..’ అంటూ మండిపడ్డారు. సారా అంశం గురించి మాట్లాడుతున్నప్పుడు సభలో ఇందిరమ్మ పేరు తీయడం ఎందుకని ప్రశ్నించారు. రాకేశ్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఇప్ప పువ్వు సారా అంశంలో ఇందిరమ్మ పేరు ఎత్తడం మహిళా లోకాన్ని అవమానించడమేనని అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ.. రాకేశ్ రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఆయన క్షమాపణలు చెప్పాలని పట్టుబట్టారు. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మాట్లాడుతూ.. ఇందిరమ్మ పేరుపై గంటకు పైగా సభా సమయం వృథా చేయడం సరికాదన్నారు. సభ్యుడు తప్పుగా మాట్లాడి ఉంటే ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు.