అమావాస్యని పురస్కరించుకొని సకల దోష నివారణార్థం స్వర్ణగిరిలో శ్రీ సుదర్శన నారసింహ హవనం జల నారాయణ స్వామి వారికి మంగళహారతులు..
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
సకల దోష నివారణార్థం అమావాస్యని పురస్కరించుకొని స్వర్ణగిరి క్షేత్రంలో శనివారం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనం నిర్వహించారు.

ఆలయంలో శ్రీస్వామి వారికి ప్రాతఃకాలంలో సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించి అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువుతీరినట్టి గోపృష్ట దర్శనాన్ని చేయించారు. శ్రీ అష్టలక్ష్మి మండపంలో శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పంచామృతములు, పసుపు,సుగంధ ద్రవ్యాలతో వేదమంత్రోచ్ఛారణలతో వసంతోత్సవ సేవను శోభాయ మానంగా చేశారు. నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీవారి వైభవోత్సవ మండపంలో వేదమంత్రాలతో మంగళ ధ్వనుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్రదీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం సందర్భంగా జల నారాయణ స్వామి వారికి మంగళహారతులు సమర్పించారు.