ముద్ర,మేడ్చల్ జిల్లాప్రతినిధి :
హైదరాబాద్ శివారు లోని ఘట్కేసర్ మండలం అన్నోజిగూడ ఆర్వీకే పాఠశాల ప్రాంగణంలో భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారత మహా సభలు జరగనున్నాయి.ఈ నెల 27వ తేదీ నుంచి మార్చి 1 వరకు మూడు రోజులపాటు జరగనున్న సభలను భారతీయ కిసాన్ సంఘ్ అధ్యక్షుడు కె.సాయిరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రధాన కార్యదర్శి మోహిని మోహన్ మిశ్రా, అఖిల భారత సంస్థ కార్యదర్శి దినేష్ కులకర్, జాతీయ కార్యవర్గ సభ్యుడు ముదుగంటి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు జోగినపల్లి శ్రీరంగారావు, ప్రధాన కార్యదర్శి అంబీర్ ఆనందరావు, కోశాధికారి లింగనోళ్ల మాణిక్యరెడ్డి తదితరులు పాల్గొన నున్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 1000 మంది భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు మహాసభలకు తరలిరానున్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక్కో రాష్ట్రం నుంచి 30 మంది ప్రతినిధులు అఖిల భారతీయ మహాసభల్లో పాల్గొనున్నారు.విత్తన చట్టాలు అన్నీ విత్తన ఉత్పత్తి కంపెనీలకు అనుకూలంగా ఉన్న దృష్ట్యా రైతులకు రక్షణ కల్పించడం కోసం ఆ చట్టాలను పునర్వవ్యవస్థీకరించాలని, ఆ చట్టాల రూపకల్పనలో రైతుల భాగస్వామ్యం ఉండాలని ఈ మహాసభలు వేదికగా బీకేఎస్ కేంద్ర ప్రభుత్వానికి సూచించనుంది. ప్రత్యేకించి దేశీయంగా విత్తన రంగం బలోపేతం కోసం స్వదేశీ విత్తనాలకు రక్షణ కల్పించాలని చాలా కాలంగా పోరాటం చేస్తోంది. దేశవ్యాప్తంగా… ప్రత్యేకించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై విస్తృతంగాచర్చించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలభిస్తున్న వ్యవసాయ విధానాలు, పెరుగుతున్న సాగు ఖర్చులు, పంటలకు ధరల హామీ, ప్రకృతి వైపరీత్యాల ప్రభావం వంటి పరిణామాలు వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్న సవాళ్లపై విస్తృతంగా చర్చించనున్నారు. దేశవ్యాప్తంగా రైతుల హక్కలు పరిరక్షించడం, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, దేశీయ వ్యవసాయ పద్ధతులు ప్రోత్సహించడంపై కీలక తీర్మానాలు కూడా చేయనున్నారు.
హర్ కిసాన్ హమారా నేతా హై అన్న నినాదంతో రైతులే నడుపుకుంటున్న ప్రపంచంలో అతిపెద్దదైన ఏకైక రైతు సంఘం భారతీయ కిసాన్ సంఘ్. ఉత్తరాన ఆసేతు హిమాచలం నుంచి దక్షిణాది కన్యాకుమారి వరకు పశ్చిమాన గుజరాత్ లోని కచ్ నుంచి తూర్పున త్రిపుర వరకు సుమారు 650 జిల్లాల్లో 85,000 గ్రామాల్లో విస్తరించి పనిచేస్తోంది.వికసిత్ భారత్ లక్ష్య సాధనలో సేంద్రీయ వ్యవసాయం, నూనెగింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి, విజ్ఞాన కేంద్రాల భాగస్వామ్యం,నాబార్డు పాత్ర వంటి అంశాలపై విస్తృతంగా చర్చినున్నామని బీకేఎస్ నేత, సీసీఎంబీ విశ్రాంత ప్రిన్సిపల్ శాస్త్రవేత్త డాక్టర్ ఏవీ రావు ఓ ప్రకటనలో వెల్లడించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రతికూల సవాళ్లు అధిగమిస్తూ రైతుల ఆదాయాలు రెట్టింపు చేయాలన్న మోదీ సర్కారు లక్ష్యం మేరకు సహజ, ప్రకృతి, సేంద్రీయ, గో-ఆధారిత వ్యవసాయ విధానాలు పెద్ద ఎత్తున రైతుల్లోకి తీసుకెళ్లడం, ఆయా ఉత్పత్తులు వినియోగం పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆహారంలో భాగం చేసుకోవడంపై తాము ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన పేర్కోన్నారు.