- గతంలో ఒకసారి విచారణకు హాజరైన కేటీఆర్.
- విచారణలో ఏం జరుగుతుందనే ఉత్కంఠలో రాజకీయ వర్గాలు.
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఫార్ములా ఈ కారు రేసు కేసులో సోమవారం నాడు ఏసీబీ విచారణకు మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. ఇదే కేసులో కేటీఆర్‌కు రెండోసారి ఏసీబీ నోటీసులు కావడం గమనార్హం. ఏసీబీ ఇప్పటికే మే 28వ తేదీన హాజరుకావాలని నోటీసులు ఇచ్చినప్పటికీ, కేటీఆర్ అప్పటికే విదేశీ పర్యటనలో ఉండటంతో విచారణకు హాజరు కాలేకపోయారు. తాజాగా విదేశీ పర్యటన ముగిసిన నేపథ్యంలో మరోసారి నోటీసులు పంపించడంతో బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. సోమవారం జరగనున్న విచారణలో ఏం జరుగుతుందన్నది రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఫార్ములా ఈ రేసును తలపెట్టిన తీరుపై గత ఎనిమిది నెలలుగా ఏసీబీ విచారణ జరుపుతోంది. ఈ సమయంలో పలువురు అధికారులను ప్రశ్నించగా, కేసులో విదేశాలకు రూ.55 కోట్లు మళ్లించడంపై ముఖ్యమైన ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. మంత్రివర్గ ఆమోదం లేకుండా హెచ్ఎండీఏ నిధుల మళ్లింపు అంశంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కేసులో ఇప్పటికే ప్రస్తుత ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి తదితరులను ఏసీబీ విచారించింది. గతేడాది డిసెంబరు 19న ఫార్ములా ఈ రేసుకు సంబంధించి అధికారికంగా కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు, దర్యాప్తు లో భాగంగా ఈ ఏడాది జనవరి 9న కేటీఆర్‌ను సుమారు ఆరు గంటల పాటు ప్రశ్నించారు.ఇప్పుడు మరోసారి విచారణకు పిలవడం కేసు వేగం పుంజుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్‌లో ఫార్ములా ఈకారు రేసింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఫార్ములా ఈకార్ రేసింగ్‌లో అవకతవకలు జరిగినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాలతో రూ.55 కోట్లు నిధిలు ఆర్ బీఐ అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా విదేశాలకు తరలించారనే ఆరోపణల మీద గతేడాది డిసెంబర్ 29వ తేదీన ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.