ముద్ర ప్రతినిధి, మెదక్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్య సిబ్బందిని ఆదేశించారు.సోమవారం హవేలీ ఘన్పూర్ మండలం సర్దన గ్రామం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ సోమవారం తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు అందిస్తున్న తీరును కలెక్టర్ ఆరా తీశారు. సిబ్బంది హాజరు పట్టిక, ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు తదితర విషయాలపై వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు పేషెంట్లతో మాట్లాడి ఏ విధంగా వైద్య సేవలు అందిస్తున్నారు. అన్ని వసతులు సక్రమంగా ఉన్నాయా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని వివరాలను అడిగి తెలుసుకున్నారు.వైద్య ఆరోగ్యశాఖ మెదక్ ఆసుపత్రుల పనితీరును మెరుగుపరిచి ప్రజల విశ్వాసాన్ని చూర గొంటున్నారని చెప్పారు. ముఖ్యంగా ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రసవాల సంఖ్య పెంచేలా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. మందులన్నీ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, ఆరోగ్య కేంద్రానికి వచ్చిన పేషెంట్లకు మెరుగైన, నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించాలని కలెక్టర్ సూచించారు.పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా మెరుగైన వైద్యం అందించే విధంగా దృష్టి సారించాలని చెప్పారు.
