Take a fresh look at your lifestyle.

విద్యుత్ ఉద్యోగులకు కోటి భీమా

  • రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచే కార్యక్రమం.
  • రికార్డ్ స్థాయిలో డిమాండ్ పెరిగినా అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసాం. 
  • రాష్ట్ర అభివృద్ధిలో విద్యుత్ శాఖ అగ్రస్థానంలో ఉండాలి.
  • బ్యాంక్ డైరెక్టర్ గా ఎడ్యుకేషన్ లోన్, కిసాన్ కార్డుల జారీ మధుర ఘట్టం.
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు. 
ముద్ర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర, దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న 50,868 మంది విద్యుత్ ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకం కోసం బ్యాంకర్లతో ఒప్పందం చేసుకోవడం రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచే కార్యక్రమం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  అన్నారు. మంగళవారం ఆయన ప్రజాభవన్ లో విద్యుత్ ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా బ్యాంకర్లతో ఒప్పందం చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు.ఈ సందర్భంగా డిప్యూటీ సీఎ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల కోసం పనిచేసే సంస్థల్లో విద్యుత్ సంస్థ ప్రధానమైనదన్నారు.ఆ సంస్థలో పనిచేసే సిబ్బంది కుటుంబాల గురించి వారి యోగ క్షేమాల గురించి ఆలోచించి తీసుకున్న ఈ ప్రమాద బీమా పథకం వ్యక్తిగతంగా తనకు బాగా తృప్తిని ఇచ్చిందని తెలిపారు. విద్యుత్ శాఖలో పనిచేసే ఉద్యోగులు రాత్రి, పగలు అని తేడా లేకుండా శ్రమిస్తారన్నారు.ప్రకృతి వైపరీత్యాలకు ప్రాణాలు అడ్డంపెట్టి విధుల్లో నిమగ్నమవుతారని కితాబిచ్చారు.అందుకే వారి కుటుంబాల యోగక్షేమాల కోసం ఈ ప్రమాద బీమా పథకాన్ని తీసుకువచ్చామని స్పష్టం చేశారు.విద్యుత్ శాఖ రాష్ట్ర జిడిపి పెరుగుదలకు  ఇందనంగా ఉపయోగపడే ప్రధాన శాఖ అని వ్యాఖ్యానించారు. లైన్ మెన్ మొదలు సీఎండీ స్థాయి వరకు పనిచేసే ఉద్యోగులందరికీ కుటుంబాలు ఉంటాయని హోదాలు వేరైనా కుటుంబం విషయానికి వచ్చేసరికి ఒకే రకమైన బంధం అనుబంధం, బాధ్యత ఉంటుందన్నారు.ఇంటి పెద్ద కు ఊహించని ప్రమాదం ఏదైనా ఎదురైతే ఆ కుటుంబం తలకిందులై గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయన్నారు.ఆ పరిస్థితులు ఏర్పడ వద్దని మనసా, వాచా కోరుకుంటున్నానని అనుకోకుండా అలా జరిగితే ఆ కుటుంబాలు తలకిందులయ్యే పరిస్థితులు రాకుండా ఉండడానికే ఈ ప్రమాద బీమా పథకానికి శ్రీకారం చుట్టామని డిప్యూటీ సీఎం తెలిపారు.
  • ఎలాంటి కాంట్రిబ్యూషన్ అవసరం లేదు
విద్యుత్తు సిబ్బందిలో నమ్మకం, ధైర్యాన్ని ఇవ్వడం కోసం ఎలాంటి కాంట్రిబ్యూషన్ లేకుండా ఈ పథకాన్ని తీసుకువచ్చామని భట్టి తెలిపారు. దీనిద్వారా ఉద్యోగుల్లో మనోధైర్యం పెరుగుతుందన్నారు. ప్రభుత్వం పైన నమ్మకం కలుగుతుందన్నారు.  ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం తమ బాధ్యతగా భావిస్తున్నానని డిప్యూటీ సీఎం తెలిపారు. ఎస్ బిఐ లో ఖాతా తెరిచిన విద్యుత్ ఉద్యోగులకు కేవలం ప్రమాద బీమా నే కాకుండా పెళ్లి, విద్యాపరమైన ఆర్థిక సహాయం లోను రుణాలు అందించి చేయూతను ఇవ్వనున్నారని తెలిపారు. శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి 80 లక్షల పరిహారం అందుతుందని తెలిపారు.బ్యాంకు ఖాతా తెరిచిన ఉద్యోగులు అకౌంట్ లో జీరో బ్యాలెన్స్ ఉన్నప్పటికీ సేవలు వినియోగించుకోవచ్చునని అన్నారు. ఏటీఎం కార్డు, చెక్ బుక్ సేవల పైన ఎటువంటి చార్జెస్ ఉండవన్నారు. సహజ మరణం చెందితే పది లక్షల వరకు ప్రమాద బీమా ఉంటుందని, ఉద్యోగితోపాటు నలుగురు కుటుంబ సభ్యులకు కలిపి 20 లక్షల వరకు బీమా సౌకర్యం వర్తిస్తుందని తెలిపారు.
  • బ్యాంకు డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించా.
యూనివర్సిటీ నుంచి బయటికి వచ్చిన తర్వాత1990లో తాను ఒక జాతీయ బ్యాంకు కు డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించానని భట్టి గుర్తు చేశారు. ఆనాడు ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వాలంటే అనేక నిబంధనలు ఉండేవన్నారు.అర్బన్ ప్రాపర్టీ లేదా నెలవారి జీతం వచ్చే వారికే ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చే వారిని వివరించారు.విద్యార్థుల బాధలను స్వయంగా చూసినవాడిగా నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఎంతోమంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్న వారికి,  ప్రైవేటు ఉద్యోగులు ఉన్న వారందరికీ రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అందుక రూరల్ ప్రాపర్టీ, నెలవారి జీతం లేకున్నా ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వాలని బోర్డులో తీర్మానం పెట్టి తాను ఆమోదింప చేశానని గుర్తు చేశారు. నాటి ప్రతిపాదనల మూలంగా డాక్టర్ పట్టాభి ఎడ్యుకేషన్ లోన్, డాక్టర్ పట్టాభి కిసాన్ క్రెడిట్ కార్డు వంటి పథకాలు వెలుగులోకి వచ్చాయన్నారు.ఇందుకు అప్పట్లో రవీంద్రభారతిలో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించి ప్రారంభించామని డిప్యూటీ సీఎం నాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.ఈనాటి చదువులకు రెగ్యులర్ గా జీతాలు వచ్చే వారు కూడా ఆ ఖర్చులు భరించలేని స్థాయిలో ఉన్నాయన్నారు.తాజా పథకంలో విద్య, వివాహ లోన్ లతో ఉద్యోగస్తులకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందన్నారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కిందిస్థాయి ఉద్యోగం నుంచి సీఎం డి వరకు వర్తించే ఈ పథకాన్ని తీసుకురావడం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వానికి తృప్తినిచ్చే కార్యక్రమం అన్నారు. రాష్ట్ర దేశ అభివృద్ధికి అత్యంత ఎక్కువగా ఉపయోగపడే శాఖ విద్యుత్ శాఖ అన్నారు, ఏ ఉత్పత్తి జరగాలన్న విద్యుత్ అనివార్యం, మనిషి బతకడానికి అవసరమయ్యే ఆక్సిజన్ కొద్దిసేపు ఆగితే ఎంత ప్రమాదమో విద్యుత్ సరఫరా కొద్దిసేపు ఆగిన కూడా అంతే ప్రమాదం అన్న పరిస్థితులు ప్రస్తుతం నెలకొని ఉన్నాయని తెలిపారు.
  • పెరిగిన డిమాండ్
2023 తో పోలిస్తే 2025 లో పిక్ డిమాండ్ 17,162 మెగావాట్లు వచ్చిందన్నారు.  గతంతో పోలిస్తే 2000 మెగావాట్ల డిమాండ్ అదనంగా పెరిగిన  విద్యుత్ సరఫరా లో చిన్న అంతరాయం లేకుండా రాష్ట్ర విద్యుత్ సిబ్బంది చూసుకున్నారని ఈ సందర్భంగా అందరికీ అభినందనలు తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు, మూసి పునర్జీవం, ఫ్యూచర్ సిటీ ఇలా రకరకాల ప్రాజెక్టులు రాష్ట్రంలో ప్రారంభం అయ్యాయి, రీజినల్ రింగ్ రోడ్డు తో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే వివిధ క్లస్టర్లతో ప్రపంచ నలుమూలల నుంచి పెట్టుబడి కోసం అంత హైదరాబాద్కు తరలి వస్తున్నారని తెలిపారు.
  • పెట్టుబడులకు కేంద్రంగా.
తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు కేంద్రంగా మారిందని, తెలంగాణ రైజింగ్ రైజింగ్ అంటూ అభివృద్ధిలో దూసుకుపోతుందని భట్టి అన్నారు.పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ ఉత్పత్తి పెంచడంతోపాటు కాలుష్య రహిత గ్రీన్ ఎనర్జీని సమకూర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో పనిచేస్తుందని వివరించారు. గత పది సంవత్సరాలు ప్రత్యేక విద్యుత్ పాలసీ లేకపోవడంతో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వెనుకబడిపోయామని వివరించారు.ఈ లోటును గుర్తించి ప్రభుత్వం ఏర్పడగానే 2025 న్యూ గ్రీన్ ఎనర్జీ పాలసీని తీసుకువచ్చామన్నారు. రాష్ట్రంలోని ఓనర్ లోని వాడుకోవడమే కాకుండా దేశవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ వనరుల సమీకరణకు ప్రయత్నం చేస్తున్నామన్నారు.2030 నాటికి 20వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతుందని తెలిపారు. ఒకవైపు ఉత్పత్తి పెంచుకుంటూనే  సరఫరాలో 75 శాత టార్గెట్ కు చేరుకోగానే సరఫరా వ్యవస్థను అప్డేట్ చేసుకుంటూ ముందుకు పోతున్నామన్నారు.అందుకే అదనంగా రెండు వేల మెగావాట్ల పిక్ డిమాండ్ వచ్చినప్పటికీ రాష్ట్రంలో రెప్పపాటు అంతరాయం లేకుండా ఈ వేసవిలో విద్యుత్ సరఫరా జరిగిందని డిప్యూటీ సీఎం వివరించారు.ఈ పథకం ద్వారా విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలు ధైర్యంగా, నమ్మకంగా, భరోసాతో ముందుకు పోతాయన్న విశ్వాసాన్ని డిప్యూటీ సీఎం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో విద్యుత్ శాఖ అగ్రస్థానంలో ఉండాలని సిబ్బంది ఈ లక్ష్యసాధనకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఇంధన శాఖ సీఎం డి సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్కో సిఎండి కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.