ముద్ర మల్కాజిగిరి
బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి… దీంతో నగరంలో చైన్ స్నాచింగ్ ఘటనలు రోజురోజుకీ కొత్త పద్ధతుల్లో జరుగుతున్నాయి. ఒక్క తులం పోగొట్టుకుంటే లక్షన్నర రూపాయలు పోయినట్టే…
తాజాగా మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమన్‌పేట్‌లో జరిగిన ఘటన స్థానికులను కలవరపెడుతోంది.
న్యూ నల్లకుంటకు చెందిన శ్రీమతి మల్లవజ్జుల పద్మజ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, ఆమె తల్లి మహంకాళి లక్ష్మీకాంతం (85) హనుమన్‌పేట్‌లో నివాసం ఉంటున్నారు. బుధవారం సాయంత్రం (మార్చి 4) సుమారు 5 గంటల సమయంలో ఒక పురుషుడు, ఒక మహిళ, ఒక చిన్న పాప కలిసి ఆమె ఇంటికి వచ్చారు.
“మాకు మీ ఇంట్లో ఏదైనా పని ఉందా? ఉంటే ఇక్కడే ఉండి పని చేసుకుంటాం” అంటూ వారు అడిగారు. పని లేదని లక్ష్మీకాంతం చెప్పినప్పటికీ, వారిలో ఉన్న మహిళ “పాపకు దాహం వేస్తోంది… కొంచెం నీళ్లు ఇవ్వండి” అని కోరింది.
దాంతో సహాయంగా నీళ్లు ఇవ్వడానికి లక్ష్మీకాంతం ఇంట్లోని ఫ్రిజ్ దగ్గరకు వెళ్లింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన వ్యక్తి ఆమె నోట్లో గుడ్డ పెట్టి అరవకుండా చేసి, ఆమె మెడలో ఉన్న సుమారు రెండు తులాల బంగారు గొలుసును తెంపుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన మల్కాజిగిరి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇలాంటి కొత్త పద్ధతుల్లో మోసాలు, చైన్ స్నాచింగ్ ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో, అపరిచితులను ఇంట్లోకి అనుమతించే విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మల్కాజిగిరి సిఐ సత్యనారాయణ సూచిస్తున్నారు.