- భద్రత పేరిట ఆదివాసులపై కార్పోరేట్ కంపెనీల దాడి.
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్.
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. భద్రత పేరిట ఆధివాసులపై కార్పోరేట్ కంపెనీల దాడి జరుగుతుందని ఆయన మండిపడ్డారు. ఆపరేషన్ కగార్ అనేది ఆపరేషన్ కార్పోరేట్ కబ్జా లాంటిదని ఆయన దుయ్యబట్టారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆపరేషన్ కగార్‌ను నిరసిస్తూ మహాధర్నా జరిగింది. దీనిలో పాల్గొన్న ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. అడవులు, జీవవనరులు కార్పోరేట్ సంస్థల ఖాతాల్లోకి వెళ్ళకూడదన్నారు.ఆదివాసుల ఆత్మగౌరవాన్ని రక్షించాల్సిన బాధ్యత పాలకులపైనే ఉందన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో కాల్పులను భేషరతుగా ఆపాలని వరంగల్ సభలో తమ పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టంగా పేర్కొన్నారని ఎమ్మెల్సీ శ్రవణ్ తెలిపారు. కాల్పులకు స్వస్తి పలికి, కేంద్రం చర్చల బాట పట్లాలన్నదే బీఆర్ఎస్ అధికారిక వైఖరి అని ఆయన వెల్లడించారు. బీఆర్ఎస్ ఎప్పుడూ శాంతియుత పరిష్కార మార్గాన్ని కోరుకుంటుందని తెలిపారు. తుపాకులతో ప్రజలను అణచాలనే కుట్రలు కొనసాగితే, విపక్షంగా తాము మౌనంగా చూస్తూ ఉరుకోమని ఆయన వెల్లడించారు. రాజ్యాంగ పునాదులు, ఆదివాసుల భద్రత, బలమైన రాజకీయ పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని ఎమ్మెల్సీ శ్రవణ్ పేర్కొన్నారు. ఆపరేషన్ కగార్‌లో మరణించిన వారిపై స్వతంత్ర న్యాయ విచారణ జరగాలన్నారు. 5వ షెడ్యూల్ ప్రకారం గ్రామసభల అనుమతి లేకుండా ఆదివాసుల భూముల్లో ఎలాంటి చర్యలు చేపట్టరాదన్నారు.గిరిజన హక్కులు, భూస్వామ్యాన్ని కేంద్రం గౌరవించాలన్నారు.మావోయిస్టు సమస్యలపై కేంద్రం చర్చల బాట పట్టాలని, శాంతియుత పరిష్కారానికి మార్గం వేసుకోవాలని ఎమ్మెల్సీ శ్రవణ్ తెలిపారు.