Take a fresh look at your lifestyle.

త్వరలోనే ఎంపీడీఓల బదిలీలు

  • సీఎం దగ్గర ఫైల్​ పెండింగ్​.
  • ఎంపీడీఓల వాహనాల అలవెన్స్​ కు త్వరలోనే గ్రీన్​ సిగ్నల్​.
  • హామ్​ ప్రాజెక్టుతో గ్రామీణ రోడ్లకు మహర్ధశ.
  • కర్ణాటక, మహారాష్ట్ర, మద్యప్రదేశ్ ​కు అధ్యయనం కోసం ప్రత్యేకాధికారులు.
  • 15 రోజుల్లో టెండర్లపై కార్యాచరణ.
  • త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పనుల జాతర.
  • 440 గ్రామ పంచాయతీలు, 440 అంగన్​వాడీలను నిర్మిస్తాం.
  • పంచాయతీరాజ్‌, గ్రామాణాభివృద్ధి శాఖ సమీక్షలో మంత్రి సీతక్క.

ముద్ర, తెలంగాణ బ్యూరో :రాష్ట్రంలో ఎంపీడీవోల బదిలీలకు రంగం సిద్ధమైందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామాణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. త్వరలోనే ఈ పక్రియ మొదలు పెడతామని వెల్లడించారు. దీంతో పాటు ఎంపీడీవోల వాహనాలకు అలవెన్సులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వీటికి సంబంధించిన ఫైళ్లు ప్రస్తుతం సీఎం రేవంత్​ రెడ్డి, ఆర్థిక శాఖ వద్ద పెండింగ్​ లో ఉందన్నారు. కొద్దిరోజుల్లో ఈ రెండు ఫైళ్లకు క్లియరెన్స్ వస్తుందని తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ సమీక్ష సమావేశంలో సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఆయా శాఖలకు చెందిన విభాగాధికారులు తమ పరిధిలో జరుగుతున్న పనుల పురోగతిని, అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యకలాపాలను, హమ్ విధానంలో రోడ్ల నిర్మాణం, ఇందిరా మహిళా శక్తి, స్త్రీ నిధి, మిషన్ భగీరథ, ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై ప్రజెంటేషన్లు ఇచ్చారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. త్వరలో తెలంగాణ వ్యాప్తంగా ఉపాధి హామీ పనులు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఉపాధి హామీ కింద రూ. 1,800కోట్ల పనులు మంజూరు చేశామన్న ఆమె ఈ సారి అంగన్వాడీ, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది మండలానికి రెండు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 1440 పంచాయతీ కార్యాలయాలు, మరో 1400 అంగన్వాడీ భవనాలు నిర్మించనున్నట్లు వివరించారు. ఈ క్రమంలో నెలవారీగా లక్ష్యాలను నిర్దేశించుకొని పనులు చేయాలని మంత్రి.. అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం కోసం నూతన విధానం తీసుకొచ్చినట్లు మంత్రి చెప్పారు. గతంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో హమ్ విధానానికి ఆమోదం లభించిందన్న ఆమె ఆ ప్రాజెక్టుకు సంబంధించి మార్గదర్శకాలతో రెండు రోజుల్లో జీవో విడుదల చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో హామ్ విధానాన్ని అవలంబిస్తున్నారని చెప్పారు.మహారాష్ట్ర, కర్ణాటకకు అధికారుల బృందాలను పంపించాలని రెండు శాఖల అధికారులను ఆదేశించారు. రెండు రాష్ట్రాల అనుభవాలను అధ్యయనం చేసి హం విధానాన్నీ మన రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేద్దామని సీతక్క తెలిపారు.రాష్ట్రంలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి 15 రోజుల్లో టెండర్లు వేసే విధంగా అధికారులు కార్యాచరణ రూపొందించాలని చెప్పారు.ఈ సమావేశంలో పంచాయతీ రాజ్‌ ముఖ్య కార్యదర్శి ఎన్‌.శ్రీధర్‌, డైరెక్టర్‌ సృజన ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.