Take a fresh look at your lifestyle.

డంప్ యార్డుకు శాశ్వత పరిష్కారం చూపిస్తా 

  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తా.
  • సాంకేతిక నిపుణుల సహకారం తీసుకుంటా .
  • ఆందోళన వద్దు అండగా ఉంటా.
  • కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు.

 ముద్ర ప్రతినిధి, కరీంనగర్  : సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, డంపు యార్డు సమస్య పరిష్కారంలో భారతదేశంలోనే క్లీన్ సిటీ గా ఉన్న  ఇండోర్ తరహాలోనే కరీంనగర్ డంప్ యార్డ్ సమస్య పరిష్కరించేందుకు కార్యాచరణ రూపొందిస్తానని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. నగర శివారులో డంపు యార్డు సమస్య తీవ్రంగా ఉందని, ప్రజలు శ్వాసకోశ క్యాన్సర్ ఇతర వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు పరిష్కార మార్గం కనుగొనేందుకే స్వయంగా డంప్ యార్డ్ పరిశీలించేందుకు వచ్చానని తెలిపారు.బుధవారం కరీంనగర్ శివారులోని బైపాస్ రోడ్ లో ఉన్న డంపు యార్డును వెలిచాల రాజేందర్ రావు కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలతో కలిసి పరిశీలించారు.ట్రాక్టర్లో వెళ్లి డంప్ యార్డ్ పరిస్థితిని క్షుణ్ణంగా పర్యవేక్షించారు.ఈ సమస్య వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు తదితర అంశాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాయకులు, స్థానిక ప్రజల సమక్షంలో వెలిచాల రాజేందర్ రావ్ మాట్లాడారు.కరీంనగర్ డంప్ యార్డ్ సమస్య పరిష్కరించేందుకు తాను ముందుంటానని, ప్రజల ఆవేదన కాదు ఇది నా ఆవేదన అని పేర్కొన్నారు. డంప్ యార్డ్ సమస్య  ప్రజలను నిత్యం వేధిస్తున్నదని ఈ సమస్య పరిష్కారానికి మార్గాన్ని అన్వేషిస్తున్నానని తెలిపారు.

భారతదేశంలోనే ఇండోర్ వేస్ట్ మేనేజ్మెంట్ డంప్ యార్డు సమస్య పరిష్కరించి రికార్డ్ సాధించిందని గతంలో ఇండోరు కరీంనగర్ కంటే అద్వానంగా ఉండేదని పేర్కొన్నారు. భారతదేశంలోనే ఇండోర్ మంచి నగరంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నదని చెప్పారు. అక్కడ మన జిల్లా వాసి పరికిపండ్ల నరహరి మున్సిపల్ కమిషనర్ గా పనిచేశారని, ఆయన డంప్ యార్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, శానిటేషన్ విషయంలో అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టి ఇండోర్ ను దేశంలోనే ఆదర్శ నగరంగా తీర్చిదిద్దారని చెప్పారు. ప్రస్తుతం ఆయన భోపాల్ లో హెల్త్ సెక్రటరీగా పనిచేస్తున్నారని, కరీంనగర్ డంపు యార్డు సమస్యపై ఇటీవల ఆయనతో మాట్లాడానని తెలిపారు. గత 20 సంవత్సరాల నుంచి ఇండోర్ నగరం భారతదేశంలోనే అత్యుత్తమ నగరంగా అవార్డులు సాధిస్తున్నదని పేర్కొన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, డంప్ యార్డ్ సమస్య పరిష్కారానికి ఇండోర్లో చేపట్టిన వినూత్న కార్యక్రమాలు కరీంనగర్ లో అవగాహన కల్పించేందుకు రెండు రోజులపాటు సెమినార్ నిర్వహిస్తామని, ఇందుకు ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించానని తెలిపారు.నరహరి సానుకూలంగా స్పందించి తప్పకుండా వస్తాను అని హామీ ఇచ్చారని రాజేందర్రావు పేర్కొన్నారు.తన తండ్రి జగపతిరం అంటే ఈనెలేని అభిమానమని పేర్కొన్నారని తెలిపారు.ఆ గౌరవంతోనే కరీంనగర్ వచ్చి సెమినార్లో పాల్గొంటారని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఇండోర్లో డంప్ యార్డ్ సమస్య పరిష్కారంలో ప్రధాన పాత్ర పోషించిన ప్రత్యేక నిపుణుల బృందాన్ని సైతం తీసుకురావాలని కోరానని చెప్పారు. ఈ సెమినార్ కు జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్, సి డి ఎం ఏ శ్రీదేవి పలువురు అధికారులను ఆహ్వానించి సెమినార్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

తాను కూడా ఇందుకు సంబంధించిన నిపుణుల బృందాన్ని సైతం తీసుకొస్తానని చెప్పారు.డంపు యార్డు సమస్య పరిష్కారానికి తగిన బడ్జెట్ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించే బాధ్యత తీసుకుంటానని రాజేందర్రావు తెలిపారు. కరీంనగర్ లోని ఐదు డివిజన్ల ప్రజల ఆవేదనను ముఖ్యమంత్రి ముందు ఉంచి నిధులు మంజూరు చేయిస్తానని పేర్కొన్నారు. అదేవిధంగా ఇందుకు సంబంధించి కేంద్రమంత్రి బండి సంజయ్ ని కలిసి నిధులు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి నిధులు ఇప్పించాలని కోరుతానని తెలిపారు.బండి సంజయ్ కరీంనగర్ బిడ్డగా ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని గుండెల్లో నుంచి మాట్లాడి ప్రజా ప్రజా సమస్యలు పరిష్కరించాలని సూచించారు.గత బిఆర్ఎస్ పాలకులు స్మార్ట్ సిటీ పేరిట కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారని, కరీంనగర్ ను స్మార్ట్ లేస్ గా తయారు చేశారని మండిపడ్డారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ దరిదాపుల్లో కూడా లేకుండా చేశారని కానీ డంప్ యార్డ్ సమస్యకు మాత్రం పరిష్కారం చూపలేకపోయారని ధ్వజమెత్తారు. వారు చేసిన నిర్వాకం వల్ల ఇక్కడి ప్రజలు గంట గంటకు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ జీవనం సాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

దీంతోపాటు సింగరేణి సిఎండి బలరాం ఎన్ టి పి సి అధికారులు పలు కంపెనీల పారిశ్రామికవేత్తలతో మాట్లాడి డంపు యార్డు సమస్య పరిష్కారంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తానని రాజేందర్ రావు తెలిపారు. 9 ఎకరాల్లో ఉన్న డంప్ యార్డ్ వల్ల ఇక్కడి ఐదు డివిజన్లకు సంబంధించిన ప్రజలు నిరంతనం గోసపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.తాను స్వయంగా డంప్ యార్డ్ పరిస్థితి చూస్తే తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయని, ప్రజల ఏళ్ల నుంచి ఈ వేదన భరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గుట్టలు గుట్టలుగా డంపు పేరుకుపోవడం వల్ల దుర్గంధం వల్ల ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డంప్ యార్డ్ లో పేరుకుపోయిన చెత్తను తీసుకెళ్లి ఒద్యారం క్వారీ గుంతల్లో పోయడమా లేక రుక్మాపూర్ ప్రాంతంలో తరలించడమా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూస్తామని పేర్కొన్నారు.

ఎన్నికలు ఉన్నాయోనో.. ఓట్ల కోసమో ఇక్కడికి రాలేదని ప్రజల సమస్యను పరిష్కరించేందుకు తాను ఇక్కడికి వచ్చానని రాజేందర్ రావు స్పష్టం చేశారు.ఈ సమస్య తన సమస్యగా భావించి పరిష్కరించేందుకు పరిష్కార మార్గాలను కనుక్కుంటానని, ఇక్కడి ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని అధైర్య పడవద్దు అని మీ వెంట నేనుంటానని భరోసా కల్పించారు.ఈ సమస్య పరిష్కారానికి ఒక కార్యాచరణ ప్రారంభించి ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. మనసుంటే మార్గం ఉంటదని సమస్య పరిష్కారానికి అనేక మార్గాలు ఉంటాయని, ఆ దశగా ఆలోచిస్తే తప్పకుండా ఫలితం లభిస్తుందని రాజేందర్ రావు పేర్కొన్నారు. డంపు యార్డు సమస్య పరిష్కారంలో ఎల్లప్పుడు ముందు ఉంటానని, ప్రజల బాధలు అర్థం చేసుకొని ఈ సమస్య పరిష్కారానికి నిరంతరం పాటుపడతానని రాజేందర్రావు పేర్కొన్నారు.స్థానిక ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఈ సమస్య తన ఆవేదనగా భావించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వైద్యులు అంజన్ కుమార్, కట్ల సతీష్ పడిశెట్టి భూమయ్య, ఆకుల నరసన్న గంట శ్రీనివాస్, తుమ్మనపల్లి శ్రీనివాసరావు కర్ర రాజశేఖర్, కోటగిరి భూమా గౌడ్, గడ్డం విలాస్ రెడ్డి, మడుపు మోహన్, సిరాజు హుస్సేన్, కంకణాల అనిల్ కుమార్ గుప్తా, ముద్దసాని క్రాంతి ఆకుల ఉదయ్, దొంతి గోపి, శ్రావణ్ నాయక్, బత్తిని చంద్రయ్య గౌడ్, గడ్డం శ్రీరాములు, బొమ్మ ఈశ్వర్ గౌడ్ బోనాల మురళి పలువురు నాయకులు, స్థానికులు మంగ, శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.