మానస హిల్స్‌లో ఎలాంటి బ్లాస్టింగ్‌లు జరగలేదు
బిఆర్ఎస్ ఆరోపణలపై వివరణ
ముద్ర, హైదరాబాద్ :
హైదరాబాద్ జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని మానస హిల్స్ లో శ్రీ పొంగులేటి ప్రసాద్ రెడ్డికి చెందిన రాఘవ కన్సస్ట్రక్షన్స్ ఎలాంటి అనుమతులు లేకుండా క్వారీలు నిర్వహిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర బిఆర్ఎస్ నాయకుల చేసిన ఆరోపణలను రాఘవ కన్సస్ట్రక్షన్స్ కంపెనీ ఖండించింది. ఇందులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాఘవ కన్స్ట్రుక్షన్స్ కు ప్రత్యక్షంగా లేక పరోక్షంగా ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఇది కేవలం మంత్రి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకు బిఆర్ఎస్ చేస్తున్న కుట్ర అని ఆరోపించింది. శుక్రవారం మానస హిల్స్ లోని కంపెనీ సైట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హెచ్. ఆర్ .డి. సి .ఎల్. రోడ్స్ రాఘవ కన్సస్ట్రక్షన్స్ ప్రాజెక్ట్ మేనేజర్ డి. గోపాల కృష్ణ, తిరుమల మెటల్ ఇండస్ట్రీస్ యజమాని కుమార రాజా మాట్లాడారు. 2022-23 లో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే, బుద్వేల్‌లో వంద ఎకరాల భూమిని హెచ్ఎండీఏ వేలం వేసిందన్నారు. ఈ వంద ఎకరాల భూమిలో లేఔట్ డెవలప్మెంట్ పనుల కాంట్రాక్టును హెచ్ఎండీఏ, ఎన్ సీసీ లిమిటెడ్ కంపెనీ కి అప్పగించినట్లు తెలిపారు. ఈ లేఅవుట్ చేస్తున్నప్పుడు బయటపడ్డ రాళ్లను, కోత్వాల్‌గూడలో ఆ కంపెనీ డంప్ చేశారని చెప్పారు. అదే డంప్ మెటీరియల్‌ను ఇప్పుడు క్రషింగ్ చేస్తుంటే, కొత్తగా క్వారీలు తవ్వుతున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ డంప్ చేసిన రాళ్లను ఎన్ సీసీ లిమిటెడ్ వారు కూడా, డీకేఆర్ అనే కంపెనీ ద్వారా క్రషింగ్ చేసి హెచ్ఎండీఏ బుద్వేల్ ప్రాజెక్ట్ లో రోడ్ పనులకు వినియోగిస్తున్నారని చెప్పారు. అదే విధానంలో అదే డంప్ చేసిన రాళ్లను తిరుమల మెటల్ ఇండస్ట్రీ క్రష్ చేయగా ఆ మెటీరియల్ ను రాఘవ కన్సస్ట్రక్షన్స్ తమ రోడ్డు పనుల కోసం కొనుగోలు చేసిందన్నారు. గత కొన్నేళ్ల నుంచి న్ని సంవత్సరాల నుండి ఈ ప్రదేశం లో ఎటువంటి బ్లాస్టింగ్ జరగలేదనీ, అలాగే ఎటువంటి మైనింగ్ జరగలేదని వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ ప్రాంతంలో ఒక్క కొత్త క్వారీకి అనుమతి ఇవ్వలేదన్నారు. వృధాగా పడి ఉన్న రాళ్లను మాత్రమే క్రషింగ్ చేస్తున్నట్లు చెప్పారు. అది కూడా తిరుమల మెటల్ ఇండస్ట్రీస్ ద్వారానే చేస్తున్నామన్నారు. అంతే తప్ప ఇందులో రాఘవ కన్స్ట్రక్షన్ కి ఎలాంటి సంబంధం లేదన్నారు. రోడ్డు పనులకు సంబంధించి రాఘవ కన్స్ట్రక్షన్ కు హెదరాబాద్ రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చెల్లించే బిల్లుల్లో, అన్ని ప్రభుత్వ విధి విధానాలను అనుసరిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన రాయల్టీని రికవరీ చేస్తామన్నారు. అన్నీ పారదర్శకంగా జరుగుతుంటే ‘దొంగతనం’ అనడం విడ్డూరంగా ఉందన్నారు. వట్టినాగులపల్లి, కోకాపేట, అనేక ప్రాంతాల్లో ఇదే విధానం లో అనేక క్రషర్లు బిఆర్ఎస్ ప్రభుత్య హయాంలో నుండి చుట్టూ పక్కల సెల్లారు తవ్వకాలలో వచ్చిన రాళ్లను వినియోగించుకుంటున్నారని వివరించారు. ఆధారాలు లేకుండా తమ కంపెనీ యొక్క ఇమేజ్‌ను దెబ్బతీసేలా మాట్లాడితే, న్యాయపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.