ముద్ర, తెలంగాణ బ్యూరో :
దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ముందుకు తీసుకెళ్లేలా కేంద్ర సర్కార్ బడ్జెట్ కు రూపకల్పన చేసిందనికేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. వచ్చే ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు ఆశాజనకంగా ఉందన్నారు. గతేడాది కంటే ఈసారి బడ్జెట్ పెరిగిందన్న ఆయన ఇందులో తెలంగాణకూ ప్రయోజనాలు చేకూరాయన్నారు. ఆదివారం న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం పెంచిన ఎరువుల రాయితీతో తెలంగాణ రైతులు లబ్ధి పొందుతారన్నారు. కాకతీయ టెక్స్ టైల్ పార్క్ కు లబ్ధి కలిగే పథకాన్ని కేంద్రం తీసుకువచ్చిందన్నారు. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక బాలికల హాస్టల్ ను కేంద్ర ఏర్పాటు చేయనుందనీ ఈ క్రమంలో రాష్ట్రంలో 33 జిల్లాలకు బాలికల హాస్టళ్లు మంజూరు అవుతాయన్నారు. రైల్వే బడ్జెట్ ను రూ. 2.77 లక్షల కోట్లకు పెంచిందన్నారు. రాష్ట్రానికి మూడు హైస్పీడ్ రైళ్లు రానున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. డేటా సెంటర్లకు ఇచ్చే ప్రోత్సాహంతో తెలంగాణకు లాభం జరుగుతుందన్నారు. విదేశీ విద్యపై పన్ను తగ్గించడంతో తెలుగు విద్యార్థులకు ఎంతో
మేలు జరగనుందన్నారు.
బడ్జెట్ పై అవగాహన లేకే..
మెట్రో రైలు గురించి ప్రత్యేకంగా బడ్జెట్ లో ఉండదని కిషన్ రెడ్డి అన్నారు. ఇది అర్బన్ డెవలప్ మెంట్ మినిస్ట్రీస్ ఇస్తుంటుందని వివరించారు. మెట్రోపై డీపీఆర్ ఇస్తే పట్టణాబివృద్ధి శాఖ నిధులు ఇస్తుందన్నారు. ఆ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడితే ఎలా అని విపక్ష నేతలను ప్రశ్నించారు. బడ్జెట్‍లో లేకుండానే కేబినెట్ ఆమోదంతో అనేక రాష్ట్రాలకు నిధులు ఇస్తుంటామన్నారు. హైదరాబాద్ మెట్రో ఎల్ అండ్ టీ నుంచి టేకోవర్ చేయాలన్న కిషన్ రెడ్డి… ఆ తర్వాత డీపీఆర్ సిద్ధం చేస్తే ప్రక్రియ మొదలవుతుందన్నారు. జీ రామ్ జీ గ్రామాభివృద్ధికి సంబంధించినవేనన్నారు. ఈ బడ్జెట్ ఉద్యోగ, ఉపాధి కేంద్రీకృతంగా రూపొందించారన్నారు. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలకు నిధులు పెరిగాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అద్భుతంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది అన్నారు. మార్కెట్ ఒడిదుడుకులు అన్ని సర్ధుకుంటాయని చెప్పారు.
వాటాల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్‍లో కొట్లాట:
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు రెండు సంవత్సరాలుగా సీరియల్ నడిపిస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. తన ఫోన్ ట్యాప్ అయినట్లు తనకు ఎలాంటి నోటీసులు రాలేదన్నారు. ఇంటి అల్లుడి ఫోన్ నే కేసీఆర్ ట్యాప్ చేశాడని సొంత కూతురు కవితనే ఆరోపించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ హైకోర్టు జడ్జీల ఫోన్లు ట్యాప్ చేశారని పోలీసులు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకెంత కాలం దర్యాప్తు కొనసాగిస్తారని ప్రశ్నించారు. ఈ కేసులోని ఆరోపణలు అత్యంత తీవ్రమైనవన్న ఆయన చట్టం తన పని తాను చేసుకోవాలన్నారు. ప్రజల దృష్టిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ విశ్వాసం కోల్పోయాయని ఈ రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. దోచుకున్న డబ్బుల్లో వాటా కోసం కేసీఆర్ కుటుంబం కొట్టుకుంటుంటే వాటాల కోసం కాంగ్రెస్ మంత్రులు కొట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు.