Take a fresh look at your lifestyle.

గ్యాస్ సరఫరాపై హై లెవల్ కమిటీ ఏర్పాటు – పుకార్లు నమ్మొద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచన

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఏర్పాటు
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్
జిల్లా కలెక్టర్లు ప్రతి రోజు గ్యాస్ సరఫరాపై సమీక్షించాల్సిందే
గ్యాస్ సరఫరాపై ప్రజలు పుకార్లు నమ్మొద్దు
బాట్లింగ్ ప్లాంట్లలో గ్యాస్ కోరత లేదు
అపోహలను అడ్డు పెట్టుకుని బ్లాక్ చేస్తే ఉపేక్షించేది లేదు
జిల్లాలో సమన్వయ కమిటీలతో తక్షణం సమావేశం ఏర్పాటు చెయండి
గృహ వినియోగదారులతో పాటు ఆస్పత్రులు, విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ సంస్థలకు,ఆశ్రమాలకు ప్రాధాన్యత
కలెక్టర్లు,ఎస్.పి లు,పోలీస్ కమిషనర్ల వీడియో కాన్ఫరెన్స్

ముద్ర, తెలంగాణ బ్యూరో :

అమెరికా-ఇరాన్ కు జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

ప్రజల్లో లేని పోనీ అపోహలు సృష్టించి వారిని గందరగోళంలో పడేసేలా జరుగుతున్న ప్రచారంపై అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు. అసత్య ప్రచారానికి తెరదించి… గ్యాస్ బ్లాక్ మార్కెట్ కు తరలకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో హైలెవల్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలో ఎల్.పి.జి గ్యాస్ సరఫరాపై వినియోగదారులు గందరగోళం చెందుతున్న దృష్టా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఉదయం రాష్ట్ర సచివాలయంలో సహచర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు,పౌర సరఫరాల శాఖా కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర లతో కలిసి జిల్లాల కలెక్టర్లు,ఎస్.పి లు,పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎల్.పి.జి గ్యాస్ సరఫరా విషయంలో ఎటువంటి గందరగోళానికి గురి కావొద్దని,గృహ వినియోగదారులకు సరిపడా సరఫరా చేస్తామని భరోసా ఇచ్చారు. సోషల్ మీడియా వేదిక ద్వారా జరుగుతున్న తప్పుడు ప్రచారంతోటే కృత్రిమంగా గ్యాస్ కొరత సృష్టించేందుకు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రస్థాయిలో తిప్పి కొట్టారు. ఇలాంటి గందరగోళం ఏర్పడడంతోనే రోజు వారిగా 72శాతం బుకింగ్స్ జరుగుతున్నాయన్నారు. అయితే గృహ వినియోగదారులతో పాటు ఆస్పత్రులు, విద్యాసంస్థలకు,వృద్దాశ్రమలకు,ప్రభుత్వ సంస్థలకు ప్రాధన్యత క్రమంలో సరఫరా చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 810 ఎల్.పి.జి డిస్ట్రిబ్యూటర్ల ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతుందని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 29 లక్షల ఎల్.పి.జి కనెక్షన్లు ఉండగా రోజు వారిగా 2.5 లక్షల సిలిండర్ల సరఫరా జరుగుతుందని ఆయన వివరించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోనీ బాట్లింగ్ ప్లాంట్లలో గ్యాస్ కొరత ఉన్నట్లు ఎక్కడా నమోదు కాలేదని ఆయన చెప్పారు. అపోహలను అడ్డుపెట్టుకుని బ్లాక్ చేయాలని చూస్తే ప్రభుత్వం ఎంత మాత్రం ఉపేక్షించదని, కఠినమైన చర్యలకు ఉపక్రమిస్తుందని ఆయన హెచ్చరించారు. తాజగా జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమంగా గ్యాస్ నిలువ చేయడం,అక్రమంగా మళ్లించడం ,బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడనందుకు ఇప్పటి వరకు 288 కేసులు నమోదు చేశామని చెప్పారు. ఎల్.పి.జి డిస్ట్రిబ్యూటర్లు ఇదే విదంగా ప్రవర్తిస్తే మరిన్నీ కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు,ఎస్.పి లు,పోలీస్ కమీషనర్లకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. ఆయా జిల్లాల్లో కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక అధికారుల కమిటీ ఏర్పాటు చేసి రోజువారీ నిల్వలు,సరఫరా పరిస్థితిని సమీక్షించాలని ఆయన సూచించారు. పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల కొకసారి ,గ్రామీణ 45 రోజులకు ఒకమారు ఎల్.పి.జి బుక్ చేసుకోవాలని ఆయన గ్యాస్ వినియోగదారులకు సూచించారు. అదే సమయంలో అపోహలను నమ్మి అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేసుకోవొద్దని,గృహా వినియోగ దారులకు సరిపడా గ్యాస సరఫరా చేస్తామని,ప్రభుత్వం దగ్గర ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.