Take a fresh look at your lifestyle.

విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి – భారత్‌ను తిరిగి విశ్వగురువుగా చేయాలి: వెంకయ్య నాయుడు

గౌరవప్రదంగా విభేదించడం’ ప్రజాస్వామ్య లక్షణం
నేతల ప్రవర్తన, భాష హుందాగా ఉండాలి
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
పూణే ‘ఎంఐటి స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ విద్యార్థులనుద్దేశించి ప్రసంగం

న్యూఢిల్లీ :

దేశ భవిష్యత్తు అయిన యువత విలువైన సిద్ధాంతాలతో రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. కేవలం అధికారం కోసం కాకుండా సిద్ధాంతాలు, విలువలు, ప్రజా జీవితంలో ఉన్నత ప్రమాణాలు, నిజాయితీ, మంచి ప్రవర్తనతో కూడిన రాజకీయం కోసం అయి ఉండాలన్నారు. రాజకీయాల్లో మొదటి సూత్రం ఎదుటి వ్యక్తి దృక్పథాన్ని గౌరవించాలన్నారు. రాజకీయ నాయకుడికి ఇతరుల మాట వినే ఓపిక ఉండాలన్నారు ఒకవేళ ఏకీభవించకపోతే గౌరవప్రదంగా విభేదించాలే తప్ప వ్యక్తిగత దాడులు చేయొద్దని సూచించారు. ఎదుటిపార్టీలో ఉన్నవారు రాజకీయ ప్రత్యర్థులే కానీ శత్రువులు కాదన్నది గుర్తుంచుకోవాలన్నారు. గౌరవప్రదంగా విభేదించడం ప్రజాస్వామ్య లక్షణం అన్నారు. అడ్డంకులు సృష్టించే రాజకీయం కంటే అభివృద్ధి, నిర్మాణాత్మక చర్చలు అవసరం అని అభిప్రాయపడ్డారు. ప్రజా జీవితంలో నేతల ప్రవర్తన, భాష హుందాగా ఉండాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న శక్తి అపారమని చెప్పారు. ప్రజలు బూతులు మాట్లాడే నేతలను ఓడిస్తారని స్పష్టం చేశారు.
శుక్రవారం న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో పూణేలోని ‘ఎంఐటి స్కూల్ ఆఫ్ గవర్నెన్స్’ కు చెందిన ఎం.ఏ. పొలిటికల్ లీడర్‌షిప్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం వారితో ముచ్చటించి వారు అడిగిన సందేహాలను తీర్చారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ రాజకీయాల్లో అసహనానికి చోటు ఉండొద్దన్న ఆయన ప్రత్యర్థులను శత్రువులుగా చూడకుండా వారి అభిప్రాయాలను గౌరవించే సంస్కృతిని అలవర్చుకోవాలని సూచించారు. రాజకీయాల్లో సోమరితనానికి చోటు లేదన్నారు. క్రమశిక్షణతో కూడిన సమయ పాలనే తనను ఈ స్థాయికి చేర్చిందని ఆయన వివరించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌.కె. అద్వానీ వంటి నేతల సమయ పాలనను ఆయన ఉదహరించారు. తాను ఎప్పుడూ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని చెప్పారు. తన కుటుంబ సభ్యులను కూడా స్వశక్తితో ఎదగాలని ప్రోత్సహించానని ఆయన స్పష్టం చేశారు. నాయకులు పారాచూట్ లాగా దిగకూడదని, క్షేత్రస్థాయి నుంచి కష్టపడి పైకి రావాలని సూచించారు. డిజిటల్ విప్లవం వల్ల అవినీతి తగ్గుతోందని, అయితే యువత గ్యాడ్జెట్లకు బానిసలై తమ సృజనాత్మకతను కోల్పోకూడదని హెచ్చరించారు. భారతీయ సంస్కృతి, వారసత్వాన్ని కాపాడుకోవాలని శ్రీ వెంకయ్య నాయుడు విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. యువత రాజకీయాల్లోకి వచ్చే ముందు వివేకానంద, సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్, వాజ్‌పేయి వంటి మహనీయుల జీవితాలను అధ్యయనం చేయాలన్నారు. మాతృభాష కంటి చూపు వంటిదని, పరభాషలు కళ్లజోడు వంటివని ఆయన అభివర్ణించారు. రాజ్యసభలో 22 భాషల్లో మాట్లాడే వెసులుబాటు కల్పించిన విషయాన్ని గుర్తు చేస్తూ, రాజకీయ నాయకులు తమ ప్రజలకు చేరువ కావాలంటే మాతృభాషలోనే మాట్లాడాలని సూచించారు. భారతదేశం మళ్ళీ ‘విశ్వగురువు’గా ఎదిగేందుకు యువత తమ వంతు కృషి చేయాలని, భారత్ విశ్వగురువుగా అవతరించడం అనేది విస్తరణ కోసం కాదని స్పష్టం చేశారు. ఇటీవల ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు, ఘర్షణల గురించి ప్రస్తావిస్తూ విస్తరణ వాదం, ఇతరుల భూభాగంపై వ్యామోహం సరికాదని ఆధునిక నాగరికతలో యుద్ధాలు, హింస ఏమాత్రం మంచిది కాదని ఆయన స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.