ముద్ర, పెబ్బేరు: ప్రమాదవశాత్తు షాట్సర్క్యూట్ తో ఓ ఎలక్ట్రికల్ షాపు పూర్తిగా దగ్ధమైన ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలో జరిగింది.స్థానికులు,బాధితులు తెలిపిన వివరాల ప్రకరాం..శుక్రవారం అర్ధరాత్రి తెల్లవారితే శనివారం ఒంటి గంట సమయంలో పెబ్బేరు ఏఎంసీ ఛైర్పర్సన్ ప్రమోదిని కుమారుడు యుగంధర్ రెడ్డికి చెందిన ఎలక్ర్టికల్ షాపులో ప్రమాదవశాత్తు షాట్సర్క్యూట్ జరిగి పొగలు వస్తుండటంతో షాపు ఎదురుగా పుచ్చకాయలు అమ్మేవారు నిద్రిస్తున్న సమయంలో కాలుతున్న వాసన వచ్చి లేచి చూశారు.షాపులో నుంచి పొగలు వస్తుండటంతో ఓనర్లకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు.వెంటనే ఓనర్లు ఫైరింజన్కు సమాచారం ఇవ్వగా వారు వెంటనే అక్కడికి చేరుకొని మంటలను ఆర్పేశారు.కాని అప్పటికే షాపులో ఉన్న ఎలక్ర్టికల్ వస్తువులు, పీవీసీ పైపులు,తదితర సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి.
షాపు వెనకాలే ఓనర్ ఫ్యామిలీ ఉండటంతో యుగంధర్ రెడ్డి స్థానికుల సహకారంతో నిచ్చెన సాయంతో వారిని బయటికి తీసుకొచ్చారు.ఫైర్ సిబ్బంది సమయానికి రావడంతో మంటల వ్యాప్తికి అడ్డుకట్ట పడింది.లేదంటే పక్కనున్న షాపులకు కూడా మంటలు వ్యాపించి భారీ ఆస్తి నష్టం జరిగేది.మొత్తం భవనమే కూలి పడేది. షాపులో శ్లాబుతో సహా పిల్లర్లు, పక్క గోడలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి.ఈ ఘటనతో షాపు ఓనరు దిగ్బ్రాంతికి గురయ్యారు. 3 రోజుల క్రితమే షాపులో కొత్త స్టాకు పెట్టినట్లు తెలిపారు.సుమారు రూ. 35 లక్షల నుంచి రూ.40 లక్షల దాకా నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేశారు. ఘటన గురించి తెలుసుకున్న స్టేట్ ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ చిన్నా రెడ్డి,వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.ప్రభుత్వ పరంగా సహకరిస్తామని భరోసా ఇచ్చారు.ఈ విషయమై పోలీసులను సంప్రదించగా బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని పెబ్బేరు ఎస్సై హరిప్రసాద్ రెడ్డి తెలిపారు.