- మార్చి నెలలో 15,497 మిగావాట్లకు చేరిన విద్యుత్ పీక్ డిమాండ్.
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
ముద్ర, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు అని ఎన్నికల ముందు ఆర్ఎస్ నేతలు ప్రచారం చేశారని, అయితే ఇప్పడు తాము నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడమే కాకుండా మిగులు విద్యుత్తు లక్ష్యంగా ముందుకు పోతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉత్పత్తులు పెరిగాయి ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని ఆయన వివరించారు. మార్చి 2023లో బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ డిమాండ్ 15,497 మెగావాట్లు కాగా మార్చి 2025న కాంగ్రెస్ పాలనలో విద్యుత్తు పిక్ డిమాండ్ 17,162 మెగావాట్లకు చేరిందన్నారు. ఒకేసారి 2,000 మెగావాట్ల మేరకు డిమాండ్ పెరిగినప్పటికీ రెప్పపాటు కూడా విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా ముందుకు వెళ్ళామని ఆయన తెలిపారు. 2035 నాటికి తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ 33, 775 మెగావాట్లుగా అంచనా వేశాం, అందుకు తగిన విధంగా ఉత్పత్తి, సరఫరా కు అవసరమైన ప్రణాళికలను ఇప్పుడే సిద్ధం చేశామని ఆయన వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం జడ్చర్ల నియోజకవర్గం లో 16. 33/11కేవీ సబ్ స్టేషన్‍ను ప్రారంభించిన అనంతరం నవాబుపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు.. రాష్ట్రంలో సమృద్ధిగా విద్యుత్ సరఫరా ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు తెలంగాణ రాష్ట్రానికి తరలి వస్తున్నారని వారందరికీ అవసరమైన విద్యుత్ సరఫరా చేస్తామన్నారు, ప్రపంచం తోనే పోటీ పడతామని ఆయన తెలిపారు. తెలంగాణ రైసింగ్‌ను కుట్ర దారులు ఆపలేరన్నారు, ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల ప్రభుత్వం ద్వారానే సాధ్యమన్నారు. రాష్ట్రంలో 90 లక్షల కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఆయన చెప్పారు, ఈ సంక్షేమాన్ని చూడలేని పథకాలు ప్రజలకు చేరవద్దు అనుకునే కొద్దిమంది తమ ఆశయానికి సోషల్ మీడియా ద్వారా తూట్లు పొడవాలని చూస్తున్నారని ఆయన అన్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరగవద్దని దయ్యాలు వికట అట్టహాసం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ప్రజలకు పథకాలు అందవద్దు, వారిలాగే దోపిడీ చేయాలని గత పాలకులు భావిస్తున్నారు కానీ ప్రజలే కేంద్రంగా పాలన జరగాలని మా తపన అని డిప్యూటీ సీఎం తెలిపారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలను కష్టపెడుతుంది అని బీఆర్ఎస్ నేతలు ముసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు. ఈ ప్రభుత్వం పాలకుల కోసం కాదు ప్రజల కోసమే అని గుండెపై చేయి వేసుకొని తాను ధైర్యంగా చెబుతున్నానని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. ఒక ఇంట్లో 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు, ఒక్కొక్కరికి ఆరు కేజీల చొప్పున సన్న బియ్యం, దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ సన్న బియ్యం పంపిణీ జరగడం లేదన్నారు. శక్తి ఉండి పనిచేసుకుంటాం అంటే ఉపాధి పని, చదువుకునే పిల్లలకు బలమైన ఆహారం అందించేందుకు 40 శాతం డైట్ చార్జీలు పెంచామన్నారు.ఉన్నత చదువులు చదువుకునే పిల్లల కోసం ఫీజు రియంబర్స్మెంట్ చేస్తున్నామ్నారు. ఆ ఇంట్లో ఎవరైనా జబ్బు పడితే పది లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్య సహాయం అందిస్తున్నామని ఆయన తెలిపారు.చదువుకున్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు రానివారికి రాజీవ్ యువ వికాసం కింద స్వయం ఉపాధి పథకం, ఆ ఇంట్లో రెండు లక్షల వరకు అప్పు తెచ్చుకున్న రైతుకు రుణమాఫీ నేరుగా రైతు అకౌంట్లో జమ చేశామ్నారు, ప్రతి రైతుకు రైతు భరోసా కింద 12000, భూమిలేని ఇంట్లో వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద 12000, ఇల్లు లేని వారు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు, ఇంట్లో వృద్ధులు వితంతువులు ఉంటే వారికి పెన్షన్ ప్రతినెల ఇచ్చేలా కార్యక్రమాలు చేస్తున్నామని ఆయన వివరించారు.