పేదలే ఇందిరమ్మ ప్రభుత్వం పేటెంట్
వెలుగుమెట్లలో 2023లో ఇళ్లు కూలగొట్టింది బిఆర్ఎస్ ప్రభుత్వమే
బాధితులకు ఇంటిస్ధలం, ఇళ్లు ఇచ్చే బాధ్యత మాది
వరుస ఎన్నికల్లో ప్రజల బుద్ది చెబుతున్నా మారని బిఆర్ఎస్ వైఖరి
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో బిఆర్ఎస్ అవినీతికి బిజేపీ సహకారం
కేసీఆర్ అసెంబ్లీకి రావాలి- మంచి సలహాలు సూచనలు ఇవ్వాలి
మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్ స్పష్టీకరణ
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటివరకు జరిగిన పార్లమెంటు, ఉప ఎన్నికలు, పంచాయితీరాజ్, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టడాన్ని జీర్ణించుకోలేక ప్రతిపక్ష బిఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నారనీ, వీరికి బిజేపీ నేతలు వంతపాడుతున్నారని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట స్వామి ఆరోపించారు. గురువారం సచివాలయంలో ఎంపీ బలరాం నాయిక్, రామ సహాయం రఘుమారెడ్డి, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, మాధవరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ముందుగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ …2023 జూలై 15న వెలుగుమట్లలో నాటి బిఆర్ఎస్ ప్రభుత్వమే పేదల ఇండ్లను కూలగొట్టించిందని ఆరోపించారు. అక్కడ పేదలకు ఇండ్లు తిరిగి కట్టిస్తామని హామీ ఇచ్చి గాలికి వదిలేసిందన్నారు. కానీ ఇందిరమ్మ ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా అక్కడ అక్రమంగా ఉన్న ఇండ్లను తొలగించిందని చెప్పారు. పేదలే ఇందిరమ్మ ప్రభుత్వం పెటెంట్ అన్న పొంగులేటి .. అక్కడ అర్హులైన పేదలకు ఇంటి స్ధలం, ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. . ఈవిషయంలో నిజంగా పేదలపై బిఆర్ఎస్ బావ మరుదులు, ఫాంహౌస్ లో ఉండి కుట్రలు చేస్తున్న కేసీఆర్ వెంటనే స్పందించి కాళేశ్వరంలో దోచుకున్న, దాచుకున్న సొమ్ములో కొంత భాగాన్ని బయటకు తీసి పేదలకు ఇళ్లు కట్టించి పాప పరిహారం చేసుకోవాలని పొంగులేటి సూచించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్‌ను కాదని కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ ను చేపట్టి ఎనిమిదవ వింతగా ప్రచారం చేసుకుందని ఎద్దేవా చేశారు. వారి హయాంలోనే రూ. లక్షలాది కోట్ల ప్రాజెక్ట్ కట్టడంతో పాటు అవినీతి కారణంగా బీటలు వారిందన్నారు. నాలుగేళ్లలో 168 టిఎమ్‌సీ నీరు ఇస్తామని చెప్పి దీనిలో 50 టిఎంసీల నీటిని సముద్రం పాలుచేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ బిఆర్ఎస్ కు ఎటీఎం గా మారిందన్న బిజేపీ నేతలు.. అదే పార్టీతో చేతులు కలిపారని ఆరోపించారు. జస్టిస్ ఘోష్ కమీషన్ నివేదిక ఇచ్చినా, అసెంబ్లీలో తీర్మానం చేసి సిబిఐకి ఇచ్చినా ఇంతవరకు కేంద్రం కనీసం స్పందించలేదన్నారు. .బిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో వదిలేసిన ప్రాజెక్ట్ లను తమ ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు. వచ్చే నెల 16 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీకి కేసీఆర్, బావ బావమరుదులు వచ్చి మాట్లాడాలని సూచించారు. గతంలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వలేని బీఆర్ఎస్ కు తాము కచ్చితంగా అవకాశం ఇస్తామని చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..బిఆర్ఎస్ ప్రభుత్వం నీటి ప్రాజెక్ట్‌ల విషయంలో ఉత్తర తెలంగాణకు పూర్తిగా అన్యాయం చేసిందని మండిపడ్డారు. 196 టిఎంసీల నీరు ఇస్తామని చెప్పి 168 టీఎంసీలకు పరిమితం చేసిందన్నారు. దీంతో 50 టీఎంసీలు సముద్రంలో కలిపిందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడితే తాము అధికారంలో వచ్చాక శ్వేత పత్రం జారీ చేశామన్నారు. అసెంబ్లీలో కాళేశ్వరంపై చర్చించడంతో పాటు కేంద్రం చర్యలు కోరామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు రూ. 48వేల కోట్లు మిత్తీగా కట్టిందన్న పొన్నం… కేంద్రప్రభుత్వం ఇకనైనా నిధులు ఇవ్వాలని కోరారు. మంత్రి వివేక్ వెంకట స్వామి మాట్లాడుతూ .. పదేండ్ల పాలనలో భారీ అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్.. దేశంలోని ప్రాంతీయ పార్టీల్లోకెల్లా ధనిక పార్టీగా మారిందన్నారు. సుమారు రూ. వెయ్యి కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు , ఎలక్ట్రోరల్ బాండ్లు దీనికి నిదర్శనమని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో ఏర్పడిన నష్టాన్ని కేసీఆర్ నుంచి వసూలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాంట్రాక్టర్లు, కాసుల కోసమే బిఆర్ఎస్ అనుకూల నీటిప్రాజెక్ట్‌లను చేపట్టిందన్నారు.