ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖ్యాతిని వ్యాప్తి చేసేలా వారసత్వ సంబురాలు నిర్వహించటం జిల్లా కు గర్వకారణమని విశ్రాంత ఐఏఎస్ అధికారి పార్థసారథి అన్నారు. స్థానిక సిటీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్‌లో ‘వారసత్వ సంబురాలు’ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐఎఎస్ అధికారి, మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.విజ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చరిత్ర, వైద్య వృత్తి, సంస్కృతి, సాంప్రదాయాలపై జిల్లా రచయితలు రచించిన పలు పుస్తకాలను ఆవిష్కరించారు.

అనంతరం పార్థసారథి మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. జిల్లాలో రచయితలు విశేషంగా సాహిత్య సృష్టి చేస్తున్నారని, ముఖ్యంగా మహిళా రచయితలు ముందుకు రావడం గర్వకారణమని పేర్కొన్నారు. అనంతరం వైద్యులను శాలువాలతో సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, జిల్లా వైద్యులు, కార్యక్రమ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.