ముద్ర ప్రతినిధి, నిర్మల్:
గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం పోషకాహారం అందించాలని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మార్మాట్ అధికారులను ఆదేశించారు.అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. నిర్మల్ జిల్లా దస్తురాబాద్, కడెం గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల, కడెం బాలుర గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆయన సోమవారం తనిఖీ చేశారు. విద్య, వైద్యం, భోజన ఏర్పాట్లపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులతో ముచ్చటించి భోజన నాణ్యత, సమయపాలనపై ప్రశ్నించారు. వండిన ఆహారాన్ని పరిశీలించి కంప్యూటర్ ల్యాబ్‌ను తనిఖీ చేశారు. కాగా కడెం ఆశ్రమ పాఠశాలలో 170 మంది విద్యార్థుల్లో 115 మంది మాత్రమే హాజరై ఉండగా, హాజరు నమోదు తప్పుడు విధంగా చేయడంపై వార్డెన్‌ను హెచ్చరించారు. దస్తురాబాద్ పాఠశాలలో పల్స్ యాప్ అప్‌డేట్ చేయకపోవడం, నెట్‌వర్క్ కారణాలు చూపడం, తక్కువ మోతాదులో భోజనం అందించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పల్స్ యాప్ పనితీరుపై సమీక్షించి, సమస్యలు ఉంటే వెంటనే తెలియజేయాలని సూచించారు. ప్రతి రోజు మెనూ ప్రకారం పోషకాహారం అందించాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన చేయాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు నివారించేందుకు వసతి గృహాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వంటగది, స్టోర్ రూమ్, తాగునీరు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని సూచించారు. తరగతి గదుల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పి, సబ్జెక్టుల వారీగా ప్రశ్నలు అడిగి వారి అభ్యాస స్థాయిని తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం రావాలని అన్నారు.