ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ జిల్లా పోలీసు కార్యాలయం ప్రాంగణంలో మంగళవారం ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు పోలీసు వార్షిక క్రీడోత్సవాలను ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లు, విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

క్రీడోత్సవాల ప్రారంభానికి ముందు నిర్వహించిన పరేడ్‌ను ఎస్పీ తిలకించి సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

క్రీడలతో మానసిక ఉల్లాసం…
ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు మాట్లాడుతూ… ప్రజల భద్రత కోసం పోలీసు సిబ్బంది నిరంతరం విధులు నిర్వహిస్తూ అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. అలాంటి పరిస్థితుల్లో శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటం ఎంతో అవసరమని పేర్కొన్నారు. క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగించి విధుల్లో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయని పేర్కొన్నారు.

క్రీడలు ఐక్యత, జట్టు భావన, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయన్నారు. విధుల్లో ఎంత నిబద్ధతతో పనిచేస్తారో, అదే ఉత్సాహంతో క్రీడల్లో కూడా పాల్గొని ప్రతిభ కనబరచాలని సూచించారు. ఇటువంటి క్రీడా కార్యక్రమాలు పోలీసు సిబ్బంది ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలకంగా ఉంటాయని చెప్పారు.
ఈ క్రీడోత్సవాల్లో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, బ్యాడ్మింటన్, పరుగుపందెం, లాంగ్ జంప్, షాట్‌పుట్ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎస్. మహేందర్, డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, సుభాష్ చంద్ర బోస్, సీఐలు మహేష్, రేణుక రెడ్డి, కృష్ణమూర్తి, జాన్ రెడ్డి, వెంకట రాజా గౌడ్, ఆర్‌ఐలు శైలేందర్, రామకృష్ణ, ఎస్ఐలు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.