పెరగనున్న భూముల ధరలు
మార్కెట్ విలువ ‘సవరణ’పై అధ్యయనం
సీఎంకు నివేదిక.. త్వరలోనే నిర్ణయం
హైదరాబాద్ లో ఆల్రెడీ రికార్డు ఆదాయం
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్రంలో భూముల ధరలు పెరగనున్నాయి. ఈ మేరకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. భూముల మార్కెట్ విలువ సవరణపై అధ్యయనం చేసేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల సవరణ ప్రతిపాదనలు సిద్ధం కాగా.. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా భూముల మార్కెట్ విలువను సవరించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఫైల్ సీఎంకు చేరింది. గతఏడాది హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు లోపల ప్రాంతంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఉన్న భూముల విలువ సవరణపై ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా.. సవరణ చేపట్టాలనే ప్రతిపాదనలు వచ్చాయి. ఈ మేరకు భూములు మార్కెట్ పెంపుపై ప్రతిపాదనలు సైతం సిద్ధం చేశారు. అయితే ప్రభుత్వం నుంచి ఆమోదం మాత్రం రాలేదు. ఈ క్రమంలో ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వం పలు మార్పులు చేపట్టింది.
జోన్ల వారీగా..
జీహెచ్ఎంసీ కోర్ అర్బన్ ప్రాంతాన్ని 12 జోన్లుగా విభజించింది. వాటిలో 60 సర్కిళ్లు, 300 డివిజన్లు ఏర్పాటు చేసింది. ఈ మార్పులను అనుసరించి ఆయా సర్కిళ్ల వారీగా భూముల వాస్తవిక విలువపై ఒక నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు సూచించింది. మరోవైపు రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలకు సంబంధించి చాలాకాలంగా ఎలాంటి మార్పులు చేపట్టలేదు. ప్రస్తుతం కోర్ అర్బన్ మార్పుల కారణంగా వీటికి సంబంధించి కూడా సంస్కరణలు చేపట్టే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. రాబడి అధికంగా ఉండే ప్రాంతాలను కలుపుతూ కొత్తగా రిజిస్ట్రార్ కార్యాలయాలు ఏర్పాటుచేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
పుంజుకున్న రియల్
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం మరోసారి పుంజుకుంటోంది. హైదరాబాద్ పట్టణంతో పాటు శివారు ప్రాంతాలు, జిల్లాల్లోనూ ఇళ్ల స్థలాలు, ఫ్లాట్ల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఒక్క డిసెంబరు నెలలోనే రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి రూ.1,391.30 కోట్ల ఆదాయం సమకూరింది. ఇప్పటివరకు నమోదైన రాబడిలో మే నెలలో వచ్చిన రూ.1,390 కోట్లు అధికం కాగా తాజాగా డిసెంబరులో ఆ రికార్డును అధిగమించింది. దీంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వార్షిక రికార్డులను కూడా అధిగమించి అత్యధిక రాబడిని నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి 15 నాటికే రూ.11,957.30 కోట్ల రాబడి వచ్చినట్లు అధికారులు తెలిపారు. గతంలో అత్యధిక రాబడి 2022-23లో రూ.11,806.34 కోట్లు కాగా.. ఆ రికార్డు ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి 15 నాటికి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ పరిధిలోని 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 13.42 లక్షల దస్తావేజులు రిజిస్ట్రేషన్ అయినట్లు అధికారులు తెలిపారు. 2022-23లో 16.12 లక్షల దస్తావేజుల రిజిస్ట్రేషన్లు జరిగినప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరం వచ్చినంత రాబడి అప్పుడు రాలేదు. అప్పట్లో భూముల ధరలు తక్కువగా ఉండటమే దీనికి కారణమని చెప్పవచ్చు. ప్రస్తుతం భూముల ధరలు భారీగా పెరగడంతో పాటు హైదరాబాద్ శివారు, చుట్టు పక్కల జిల్లాల్లో ఖరీదైన భూముల రిజిస్ట్రేషన్లు అధికమవడమే ఆదాయం పెరగటానికి కారణమని రిజిస్ట్రేషన్ల వర్గాలు చెబుతున్నాయి. నివాస గృహాలు, విల్లాలు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లతోపాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఇటీవల జరిగిన ఖరీదైన డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల కారణంగా రాబడి గతం కంటే పెరిగి ఉండొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లోనూ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
సమీకృత కార్యాలయాలు
ఇక రేవంత్ సర్కార్ రిజిస్ట్రేషన్ల శాఖలో పారదర్శకతను పెంచడానికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. సమీకృత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే మంత్రి పొంగులేటి పలు ప్రాంతాల్లో వీటి ఏర్పాటుకు భూమి పూజ సైతం చేసారు. ఈ విధానంలో భాగంగా.. పలు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను ఒకే చోట చేర్చి కార్పొరేట్ తరహాలో అత్యాధునిక భవన సముదాయాలను ఒకే చోట ఉండే విధంగా నిర్మిస్తున్నారు. ప్రతి జిల్లాలోనూ ఇవి ఏర్పాటు కానున్నాయి. ఈ సమీకృత ఆఫీసుల్లోనే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ల కోసం మినీ మ్యారేజ్ హాల్స్, గర్భిణుల కోసం ఫీడింగ్ రూమ్స్, వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక వెయిటింగ్ హాల్స్ వంటి ఆధునిక వసతులు కల్పిస్తున్నారు.