- సిపిఎం మండల కార్యదర్శి డి బాల్ రెడ్డి
ముద్ర,వీపనగండ్ల: ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు 200 రోజులు పని దినాలు కల్పించి,కూలికి 500 రూపాయలు ఇవ్వాలని సిపిఎం మండల కార్యదర్శి బాల్ రెడ్డి డిమాండ్ చేశారు.సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సిపిఎం బృందం ఉపాధి హామీ కూలీల సమస్యలను పని ప్రదేశానికి వెళ్లి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా బాల్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు రోజుకు 100 నుండి 150 రూపాయలు అందుతున్నాయని,వారికి కల్పించాల్సిన సౌకర్యాలు ప్రభుత్వం కనిపించడం లేదని, రోజుకు 500 రూపాయలు ఉపాధి కూలికి ఇవ్వాలని, 200 రోజుల పని దినాలు కల్పించాలని కోరారు. జూరాల,బీమా లింకు కెనాల్ కాలువలకు ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేపించాలని,అవి ఈ సంవత్సరం పెట్టకుండా లెవెలింగ్ పనులు మాత్రమే పెట్టడం సరైన పద్ధతి కాదన్నారు.ఎండలు తీవ్రంగా ఉండటంతో ఉపాధి కూలీలకు పని ప్రదేశంలోనే ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వాలని,టెంట్లు ఏర్పాటు చేసి మంచినీటి సౌకర్యం ఇతర సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు.కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆశన్న, ఈశ్వర్, నరసింహ, రామకృష్ణ, రఘు ఉపాధి కూలీలు పాల్గొన్నారు.