శివోహం అనే పదం సంస్కృతంలోని “శివః అహం” అనే సంయుక్త రూపం.
అర్థం నేనే శివుడిని” లేదా “నేను పరమాత్మ స్వరూపుడిని” అనే భావం.ఇది అద్వైత వేదాంత తత్వంలో ప్రముఖమైన భావన.
ఇందులో జీవాత్మ (వ్యక్తి ఆత్మ) మరియు పరమాత్మ (శివుడు)
రెండూ వేరువేరు కావని, అవి ఒకటేనని చెప్పబడుతుంది.
“శివోహం” అనే భావం ముఖ్యంగా నిర్వాణ షట్కం లో ప్రసిద్ధమైన పాదం:
“చిదానంద రూపః శివోహం శివోహం”
అంటే: నేను చైతన్యానంద స్వరూపుడిని; నేనే శివుడిని
ఇది భక్తి కంటే ఎక్కువగా ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చైతన్యాన్ని వ్యక్తపరచే పదం.
* * * * * * *
వరంగల్ జిల్లాలో శివాలయాలు

ఇక వరంగల్లుని ఏలిన కాకతీయ ప్రభువుల కాలం లో శివారాధనకు విశేష ప్రాధాన్యం లభించింది. కాకతీయులు శైవమతాన్ని ఆశ్రయించి శివుడిని పరమదేవుడిగా భావించారు.
ఓరుగల్లు కోట ప్రాంగణం లో స్వయంభూ దేవాలయం, హనుమకొండలోని వేయి స్తంభాల గుడి, పాలంపేటలోని రామప్ప దేవాలయం వంటి ఆలయాలు శైవ భక్తికి ప్రతీకలుగా నిలిచాయి. రుద్రదేవుడు, గణపతి దేవుడు, ప్రతాప రుద్రుడు వంటి రాజులు శైవమత పరిరక్షణకు కృషి చేశారు. శివారాధన రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాలలో కీలక పాత్ర పోషించింది. లింగారాధన ప్రధాన పూజా విధానంగా ఉండి, నిత్యాభిషేకాలు, రుద్రాభిషేకాలు, మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడేవి.
ఈ కాలంలో శైవ సంప్రదాయం శిల్పకళలో స్పష్టంగా ప్రతిఫలించింది. ఓరుగల్లు నగరంలోని కాకతీయుల కోట పరిసరాలలో ఉన్న స్వయంభూ (శంభులింగేశ్వర) శివాలయం కాకతీయుల ఆరాధ్యదైవానికి ప్రతీకగా నిలిచింది. “స్వయంభూ” అనే భావన ప్రకారం, అక్కడి శివలింగం స్వయంగా ప్రత్యక్షమైనదని భక్తులు విశ్వసిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, జాగరణలు, రుద్రపారాయణాలు నిర్వహించబడుతుంటాయి.
హనుమకొండలోని వేయి స్తంభాల దేవాలయం శైవభక్తి, శిల్పకళా వైభవానికి చిరస్మరణీయ ఉదాహరణ. 12వ శతాబ్దంలో కాకతీయ రాజు రుద్రదేవుడు నిర్మించిన ఈ త్రికూటాలయం లో ప్రతిష్ఠించిన శివలింగం సున్నితమైన శిల్పనైపుణ్యంతో రూపొందించబడింది. నంది విగ్రహం కూడా అద్భుతంగా తీర్చిదిద్దబడింది. పానవట్టం అన్ని దేవాలయలలో ఉండేలాగా కాకుండా చతురస్రాకారం లో ఉండటం ఇక్కడి విశేషం.
హనుమకొండలోనే కొలువై ఉన్న మహిమాన్వితమైన సిధ్ధేశ్వరాలయం, ఇటీవలే వెలుగులోకి వచ్చిన జలేశ్వరాలయం తో పాటు … నగరం లో ఆకారపు వారి కాశీ విశ్వేశ్వరాలయం, భోగేశ్వరాలయం కూడా శివరాత్రి దినాన సందర్శించ తగిన ప్రాచీనదేవాలయాలు. అయితే హంటర్ రోడ్ లో రోకళ్ళ శాయంపేట కూడలి సమీపం లో హనుమద్గిరి పై పశ్చిమాభిముఖుడైన శివుడు, ఆ సమీపం లోని మరకత లింగ ఆలయం కూడా శివరాత్రి పర్వదిన వేళ భక్తుల కోర్కెలు తీర్చగల క్షేత్రాలుగా ప్రశస్తి పొందుతున్నాయి.
పాలంపేటలోని రామప్ప (రామలింగేశ్వర స్వామి) దేవాలయానికి యునెస్కో వారి గుర్తిపు లభించడం ఒక ప్రత్యేకత. ఇక్కడ శివలింగం శాస్త్రోక్త విధానాలతో ప్రతిష్ఠించబడింది. ఆలయంలోని శిల్పాలు నటరాజ, అర్ధనారీశ్వర రూపాల్లో శైవ తత్వాన్ని ప్రతిబింబిస్తాయి.
ఈ శివాలయాల్లో, ఈ నాటికీ శివరాత్రి రోజున దీక్షలు, రుద్రాభిషేకాలు విశేషంగా జరుగుతాయి. పాలకుర్తి లోని కొండపై కొలువైన సోమేశ్వరాలయం కాకతీయుల కాలానికి చెందిన ప్రాచీన శైవక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన శివలింగం స్థానిక భక్తి పరంపరను ప్రతిబింబిస్తుంది. మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, జాగరణలు ఘనంగా నిర్వహించబడతాయి. శిల్పకళా లక్షణాలు, గర్భగృహ నిర్మాణం శైవ సంప్రదాయ వైభవాన్ని తెలియజేస్తాయి. ఫణిగల (పూర్వపు వరంగల్ జిల్లా) లోని ప్రాచీన రామలింగేశ్వర ఆలయం శిలాశాసనాలు, గర్భగృహ నిర్మాణ శైలి ద్వారా శైవాచార ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. కురవి, కొత్తకొండ వంటి ప్రాంతాల్లోని శివాలయాలు (వీర భద్రేశ్వరుడు) గ్రామీణ భక్తి పరంపరను బలపరిచాయి.
ఈ ప్రాచీన దేవాలయాలు కేవలం ఆరాధనా స్థలాలు మాత్రమే కాక, కాకతీయుల సామాజిక ఏకత, కళాత్మక అభిరుచి, మతసహనానికి ప్రతీకలుగా నిలిచాయి. శివారాధన ద్వారా కాకతీయ ప్రభువులు తమ రాజకీయాధికారాన్ని ధార్మికాధికారంతో మేళవించి ప్రజల్లో ఐక్యత, భక్తి, సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందించారు.
జగత: పితరౌ వందే … పార్వతీ పరమేశ్వరౌ అన్నారు పెద్దలు.
పరమేశ్వరుడి రూపాన్ని, తత్వాన్నీ తండ్రితో అన్వయించారు మన పూర్వీకులు. పరమ శివుడి ఆకృతిలో ఒక్కొక్క ఆభూషణానికీ ఒక్కొక్క అంతరార్ధం ఉన్నదనీ … విజ్ఞలు చెబుతారు. శివుని త్రిశూలం సత్వ, రజ, తమో గుణాలకు ప్రతీకగా, ఆయన చేతిలో ఢమరుకం…శబ్ద బ్రహ్మ స్వరూపంగా, శివుని శిరస్సుని అలరించే చంద్రవంక మనోనిగ్రహానికి చిహ్నంగా …గంగా దేవి శాశ్వతత్వానికి ప్రతీకగా అభివర్ణిస్తారు. దేహంపై సర్పాలు భగవంతుని జీవాత్మకి, మూడవ నేత్రం మనో నేత్రానికి సూచికలుగా పోలిక చెప్పారు.
ఆ పరమేశ్వరుడు … దేహం పై ధరించిన ఏనుగు చర్మం అహంకారాన్ని జయించమనీ, ఆసనంపై పరచుకునే పులిచర్మం కోరికలను అణచుకొమ్మనీ, భస్మం పరిశుధ్దతని ఆవాహనం చేసుకొమ్మనీ, నంది వాహనం సత్ సాంగత్యం లో చరించమనీ ప్రభోదిస్తాయి.బ్రహ్మా, విష్ణువులు సృష్టి, స్థితులకు మూలమైతే .. మహేశ్వరుడు లయ కారకుడిగా గణించబడతాడు. వేద కాలంలో రుద్రునిగా పరిగణించబడిన పరమేశ్వరుడు సింధునాగరికత కాలానికి, పశుపతిగానూ లింగ రూపునిగానూ పూజలందుకున్నాడు.
పరమేశ్వరుడు సనాతనుడు. ఆది మద్యాంత రహితుడు. తన మహేశ్వరాంశ తో బ్రహ్మ, విష్ణు అంశలనికూడా లయ స్థితికి తెచ్చే పరమ శివుడు, విరాట్ స్వరూపుడు. శివుని అష్ట మూర్త్యవ స్వరూపంగా, శ్రీ శివ మహా పురాణం పేర్కొంటుంది.
భూమిని అదిష్టించి ఉండే రూపంలో శర్వునిగా… సర్వ జీవ కోటికీ ప్రాణ తుల్యమైన ఉదకాలను అధిష్టించే భూమిగా … లోకాన్ని ప్రకాశింపచేసే అగ్నిపై నిలిచే రుద్రునిగా …. వాయువుకు అధిష్టానమైన ఉగ్రునిగా …. జీవాత్మలో వసియించే పశుపతిగా … జగత్తుకు నేత్రసమానుడై సూర్యునిలో ప్రకాశించే ఈశాననునిలా …. సకల ప్రాణులనూ … వృక్ష ఓషదులనూ … పాడి పంటలను వృధ్ధి పొందించే చంద్రునిపై అధికారం కలిగిన మహాదేవునిగా … ఇలా… సూర్య, చంద్ర , పంచభూతాలపై అధిపత్యం వహించే ఎనిమిది రూపాలుగా …
సర్వ ప్రపంచానికీ మూలమైన ఆ పరమ శివుని అభిషేకిస్తే … సర్వ దేవతలూ, ప్రకృతి శక్తులూ సంతుష్టి చెందుతాయి.
శివుడు కైలాస వాసి మాత్రమే కాదు. స్మశాన సంచారి కూడా.
అట్లాగే, శివుడు పీతాంబర ధరుడు కాదు. విభూది రాసుకుని, గజ చర్మాన్ని ధరించినవాడు. సువాసనా భరిత పుష్పాలతో సకల దేవతలనూ అర్చించినా….తుమ్మి పూవులతో, బిల్వ దళాలతో సంతుష్టి చెందే అల్ప సంతోషి.
అమృతాన్ని అందరికీ పంచి, హాలాహలాన్ని గొంతులో దాచుకున్న గరళ కంఠుడూ నీల కంఠుడూ…నిరాకారుడు, నిరాడంబరుడూ…నిరంజనుడూ …బోళాశంకరుడూ….ఆ పరమ శివుడు. అలాంటి శివుణ్ణి సదా స్మరిస్తే ….
“మద, మత్సర, కామ, క్రోధ, లోభ మోహాదులు” కొంచెమైనా మన నుంచి దూరమౌతాయి. అందుకే…ఆ మహాశివుడి తత్వాన్ని ఆకళింపు చేసుకుందాం.

ఎ.వి. అనిల్ ప్రసాద్
వరంగల్
9989292070