సెన్సస్ ఎన్నికలతో సమానమైన ప్రాముఖ్యత గలది.
సెన్సస్ సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి.
ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
సెన్సస్ ప్రక్రియ ఎన్నికలతో సమానమైన ప్రాముఖ్యత కలిగి ఉందని, ఇది కేంద్ర ప్రభుత్వ ముఖ్య కార్యక్రమమని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.

శనివారం మల్దకల్ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ లో గణనకు సంబంధించి సూపర్వైజర్లు, ఎన్నుమరేటర్లకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెన్సస్ విధులు నిర్వహించే వారందరూ బాధ్యతాయుతంగా, క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు. సెన్సస్‌లో సేకరించే సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లకుండా చూడాలని ఆదేశించారు. ఇండ్ల గణనకు సంబంధించి తప్పులు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఏడాది ఇండ్ల గణన పూర్తయితే వచ్చే ఏడాది జనాభా గణన చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఎన్యూమరేటర్ తనకు కేటాయించిన బ్లాక్‌పై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని, మ్యాప్ తయారీకి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సరైన మ్యాప్ ఉంటే సగం పని పూర్తయినట్లేనని తెలిపారు. ఇళ్ల లెక్కింపు (హౌస్ లిస్టింగ్) అత్యంత జాగ్రత్తగా చేయాలని, ఒక్క తప్పు కూడా ఉండకూడదన్నారు.
సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియను ఎక్కువగా ప్రోత్సహించాలని, ఈ విషయాన్ని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, ఆశ, అంగన్వాడి కార్యకర్తలకు తెలియజేయాలన్నారు. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు జరిగే ఇండ్ల గణన ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు.సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్ల పనిని చార్జ్ అధికారులు సమీక్షిస్తూ, మార్గనిర్దేశం చేయాలని, ఎలాంటి సమస్యలు ఉన్న వెంటనే పరిష్కరించాలన్నారు. సెన్సస్ హ్యాండ్‌బుక్ మరియు గైడ్‌లైన్స్ ప్రకారం పనులు నిర్వహించాలని ఆదేశించారు. గణనకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే శిక్షకులను అడిగి ఇప్పుడే పరిష్కరించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ సమయపాలనతో, పారదర్శకంగా, నిబద్ధతతో పనిచేస్తే సెన్సస్ విజయవంతంగా పూర్తి చేయవచ్చని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో మల్దకల్ మండల తహసిల్దార్ ఝాన్సీ, ఎంపీడీవో ఆంజనేయులు, ఎంఈఓ సురేష్, శిక్షకులు నరేష్, రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.