ప్రతిపక్ష పాత్రలో ప్రజల పక్షాన నిలబడతాం
బీజేపీ గెలుపులో మాజీ బీఆర్ఎస్ నేతలే ఎక్కువ..
కాంగ్రెస్ – బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందం
బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లహరి శంకర్
నగర పాలక సంస్థ ఎన్నికల తీర్పును గౌరవిస్తూ, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడతామని , నగర ప్రజల సమస్యలపై రాజీ పడకుండా పోరాటం కొనసాగిస్తామని
బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ అన్నారు. శనివారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నగర ప్రజల తీర్పును శిరసావహిస్తున్నామని, తమను ఆదరించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేషన్‌లో బీజేపీ సాధించిన 30 సీట్లలో 11 మంది మాజీ బీఆర్ఎస్ అభ్యర్థులే ఉన్నారని, ఇతర పార్టీల నేతలను చేర్చుకుని గెలవడం బీజేపీ నైతిక విజయం కాదని విమర్శించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఇతర మున్సిపాలిటీల్లో బీజేపీ పరాజయం పాలవ్వడం కేంద్ర మంత్రి బండి సంజయ్ వైఫల్యమేనని ఎద్దేవా చేశారు.
మేయర్ ప్రమాణ స్వీకారానికి ముందే బండి సంజయ్ ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వాలని హరిశంకర్ డిమాండ్ చేశారు. గత పదేళ్లుగా బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని ఆరోపించిన సంజయ్, అదే పార్టీకి చెందిన వారిని బీజేపీలో ఎలా చేర్చుకున్నారో సమాధానం చెప్పాలన్నారు. ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థికి రూ.50 లక్షలు
ఖర్చు చేశారని ఆరోపిస్తూ, ఆ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు వెల్లడించాలన్నారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ , బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందని ఆరోపించారు.
గతంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ హయాంలో అభ్యర్థులు అక్రమాలకు పాల్పడితే ఫిర్యాదు చేయాలని ధైర్యంగా చెప్పారని, ఇప్పుడు బండి సంజయ్ తన కార్పొరేటర్ల విషయంలో అలాంటి హామీ ఇవ్వగలరా అని ప్రశ్నించారు.
ఎన్నికల ముందు ప్రత్యేక నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పిన బండి సంజయ్, గెలిచిన తర్వాత మాట మార్చారని విమర్శించారు. డివిజన్లలో బీఆర్ఎస్ అభ్యర్థులను లేకుండా చేస్తానని వ్యాఖ్యానించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, రాజకీయ ప్రతీకారం కాకుండా అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని సూచించారు.
మూడేళ్ల క్రితం శంకుస్థాపన చేసిన టీటీడీ ఆలయ పనులు ఎందుకు ఆగిపోయాయో చెప్పాలన్నారు. కేంద్ర మంత్రిగా నగరానికి ప్రత్యేక నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కాగా, పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన కార్యకర్తలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని, పార్టీ కోసం శ్రమించిన వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ
మాజీ కార్పొరేటర్ జక్కని ఉమాపతి
బిఆర్ఎస్ పార్టీ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు చేతి చంద్రశేఖర్, తొంటి రాజేందర్ రాచకొండ నరేష్ అనుమల్ల ఉమా శంకర్ దూలం సంపత్ గౌడ్ నాగుల కిరణ్ కుమార్ గౌడ్ దుర్గం శ్రీకాంత్ గౌడ్ మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.