రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అప్పన్నపేట వద్ద జులై 16 తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన సింగరేణి కార్మికుడు గండ్ల సత్యం అక్కడికక్కడే మృతి చెందగా వెంట ఉన్న తన కూతురు లావణ్య (31) ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా లావణ్య మృతదేహాన్ని రామకృష్ణాపూర్ పట్టణంలోని ఆమె భర్త సురేష్ ఇంటికి శుక్రవారం రాత్రి తీసుకురావడంతో వారు నిరాకరించారు. అక్కడి నుంచి సమీపంలోని ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు. తన కూతురి పెళ్లయిన కొన్ని రోజులకే భార్యాభర్తల మధ్య వివాదాలు రావడంతో దూరంగా ఉంటున్నారని తెలుపుతూ శనివారం మృతదేహంతో తల్లి ఆందోళన వ్యక్తం చేసింది. తన కూతురు వివాహ సమయంలో ఇచ్చిన కట్నం,బంగారం ఇప్పించాలంటూ పోలీసుల ముందే డిమాండ్ చేసింది. ఆమె తరుఫున పెద్ద మనుషులతో మాట్లాడిన సురేష్ కుటుంబ సభ్యులు ఓ ఒప్పందానికి రావడంతో వివాదం సర్దుమనిగింది. అనంతరం అంత్యక్రియలు నిర్వహించేందుకు తండ్రి స్వగ్రామానికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు.