Take a fresh look at your lifestyle.

కరీంనగర్ మహాశక్తి ఆలయంలో సోమనాథ మూల జ్యోతిర్లింగం దర్శనం

భారీగా తరలివచ్చిన భక్తులు – ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తిరస వెల్లువ

ముద్ర, కరీంనగర్:
కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయం ఆధ్యాత్మిక కాంతులతో కళకళలాడింది. సుమారు వెయ్యి సంవత్సరాల ప్రాచీనత కలిగిన సోమనాథ మూల జ్యోతిర్లింగాలు ఈరోజు భక్తులకు దర్శనమిచ్చాయి. ఈ పవిత్ర జ్యోతిర్లింగాలను ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆధ్వర్యంలో, శ్రీ శ్రీ రవిశంకర్ ఆశీస్సులతో మహాశక్తి ఆలయానికి తీసుకువచ్చారు.

జ్యోతిర్లింగాల దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భారీగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దీని ফলে ఆలయం పరిసరాలు భక్తి శ్రద్ధలతో నిండిపోయాయి. దేశవ్యాప్తంగా భక్తులకు జ్యోతిర్లింగాల దర్శనం కల్పించాలనే లక్ష్యంతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

ఇటీవల ఉగాది పర్వదినం సందర్భంగా హైదరాబాద్‌లో జ్యోతిర్లింగాల దర్శనం కల్పించగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విజ్ఞప్తి మేరకు ఈ పవిత్ర జ్యోతిర్లింగాలను కరీంనగర్‌కు తీసుకువచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య మూల జ్యోతిర్లింగాలకు రుద్రాభిషేకం నిర్వహించారు. రిషి దేవ్ రథ్ నేతృత్వంలో జరిగిన ఈ పూజా కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ముంచెత్తింది.

అదేవిధంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ బృందం నిర్వహించిన గాన కచేరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వినసొంపైన ఆధ్యాత్మిక గీతాలతో భక్తులను అలరించగా, భక్తులు జ్యోతిర్లింగాలను దర్శించుకుంటూ తన్మయత్వానికి లోనయ్యారు.

ఈ కార్యక్రమంలో మహాశక్తి ఆలయ పూజారులు, వేద పండితులు, స్టేట్ టీచర్స్ కోఆర్డినేటర్ గంగిశెట్టి అరుణ్ కుమార్ సహా అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసి, దర్శనం సాఫీగా జరిగేలా నిర్వాహకులు చర్యలు చేపట్టారు.

Leave A Reply

Your email address will not be published.