- తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
- వెంటనే సంఘాల పని తీరుపై రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం
- ఏప్రిల్ నుండి ప్రణాళికా బద్దంగా పని చేయాలని హుకుం
ముద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో: జిల్లాలో వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలు (ప్యాక్స్) ఆశించిన రీతిలో పని చేయడం లేదని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.జిల్లాలో ఎన్ని సహకార సంఘాలు సరిగ్గా పని చేస్తున్నాయో వెంటనే రిపోర్ట్ ఇవ్వాలని సంబంధిత అధికార్లను ఆదేశించారు.ప్రణాళికా బద్ధంగా సంఘాలు పని చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.ఏప్రిల్ నుంచి ప్రణాళి కా బద్ధంగా సంఘాలు పని చేయాలని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డితో కలిసి జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ప్యాక్స్ లోని యాక్టివ్ సభ్యులను తీసుకొని ఎఫ్.పి.ఓ. ఏర్పాటు చేయాలన్నారు.రెగ్యులర్ గా ప్యాక్స్ సమావేశాలు నిర్వహింస్తూ ముందుకు పోవాలని సూచించారు.రైతులకు సరైన సమయంలో తక్కువ వడ్డితో పెట్టుబడి అందించాలని, రైతుల నుంచి డిపాజిట్లు సేకరించాలని చెప్పారు.అంతే కాకుండా, సంఘాలు రైతులకు ఉపయోగపడే నూతన కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ప్యాక్స్ ద్వారా రైతులకు నూతన సాగు పద్ధతులు, ఫిష్ ఫార్మింగ్, ఫిష్ పాండ్స్, ప్రత్యామ్నాయ పంటల సాగు వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు షెడ్యూల్ తయారు చేయాలన్నారు.పశు సంవర్ధక, మత్స్య శాఖ ద్వారా రైతులకు ప్రత్యామ్నాయంగా ఆదాయం లభించేలా పథకాలను రూపొందించాలని సూచించారు. పైలెట్ ప్రాజెక్టు క్రింద 3 సహకార సంఘాల ద్వారా వ్యాపార యూనిట్ల గ్రౌండింగ్ కు కార్యాచరణ సిద్దం చేయాలని ఆదేశించారు.రైతుల ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించే అంశంలో కూడా ప్యాక్స్ పని చేయాలన్నారు. సింగరేణి మండలంలో కోతుల బెడద అధికంగా ఉందని, వీటి పరిష్కారానికి రైతులు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై స్టడీ దృష్టి సారించాలన్నారు.ఈ సమావేశంలో జెడ్పీ సిఇఓ దీక్షా రైనా, నాబార్డ్ జిల్లా అభివృద్ధి మేనేజర్ ఎల్. సుజిత్ కుమార్, జిల్లా కో ఏ ఆపరేటివ్ అధికారి జి. గంగాధర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య, జిల్లా మత్స్య శాఖ అధికారి జి. శివ ప్రసాద్, జిల్లా పశు సంవర్థక శాఖ ఏ.డి. డాక్టర్ కే. శ్రీరమణి, డిసిసిబి సిఈఓ ఎన్.వి. ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.