Take a fresh look at your lifestyle.

భవిష్యత్ ఎలక్ట్రిక్ వాహనాలదే: ఎస్కీలో బ్యాటరీ ఇంజనీర్ కోర్సు ప్రారంభం

గచ్చిబౌలి, ఫిబ్రవరి 4, 2026: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించాలంటే ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి వాడకం తప్పనిసరి అని వక్తలు స్పష్టం చేశారు. గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఎస్కీ)లో ప్రారంభమైన ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ సస్టైనబిలిటీ ఇంజనీర్ కోర్సు ప్రారంభోత్సవంలో పలువురు ప్రముఖులు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎరైడ్ ఈ-మొబిలిటీ ఫౌండర్ & సీఈఓ, హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్వాల దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ 2015లో పారిస్‌లో జరిగిన కాప్–21 సమ్మిట్‌లో 195 దేశాలు తీసుకున్న నిర్ణయాల మేరకు భూమి సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్‌లోపే నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రతి దేశం నెట్‌ జీరో కాలుష్యం లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తోందని తెలిపారు. భారత్ 2047 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించాలంటే ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి వినియోగానికి అలవాటు పడాల్సిన అవసరం ఉందన్నారు.

భూమిపై మనుషులే కాకుండా వేలాది జీవరాశులు నివసిస్తున్నాయని, వాతావరణ కాలుష్యాన్ని సృష్టిస్తున్న మనిషికి ప్రకృతిని నాశనం చేసే హక్కు లేదన్నారు. పెట్రోలియం ఆధారిత వాహనాల వినియోగాన్ని తగ్గించి విద్యుత్ వాహనాల వైపు అడుగులు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.

మరో ముఖ్య అతిథి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా సెంటర్ ఫర్ ఎనర్జీ స్టడీస్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజ్ కిరణ్ మాట్లాడుతూ వాయు కాలుష్యం కారణంగా ఐదేళ్లలోపు చిన్నారుల్లో రోజుకు సుమారు 2,000 మంది మృతి చెందుతున్నారని, 15 ఏళ్లలోపు పిల్లల్లో 93 శాతం మంది హానికరమైన గాలిని శ్వాసిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్యకరమైన భవిష్యత్ కోసం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం తప్పనిసరి అని అన్నారు. బ్యాటరీ ఇంజనీరింగ్ కోర్సుకు భవిష్యత్‌లో ఎన్నటికీ డిమాండ్ తగ్గదని, యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని పేర్కొన్నారు.

ఎస్కీ డైరెక్టర్ డాక్టర్ జి. రామేశ్వర్ రావు మాట్లాడుతూ 18 నుంచి 45 ఏళ్లలోపు బీటెక్ (మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, ఎన్విరాన్‌మెంటల్) పూర్తిచేసిన లేదా ఫైనల్ ఇయర్‌లో ఉన్నవారు ఈ కోర్సులో చేరవచ్చన్నారు. మొత్తం 600 గంటల వ్యవధితో ప్రతి బ్యాచ్‌కు 40 మంది విద్యార్థులను మాత్రమే తీసుకుంటామని తెలిపారు. బ్యాటరీ రకాలు, సాంకేతికత, రీసైక్లింగ్, సేఫ్టీ, పర్యావరణ పరిరక్షణ అంశాలపై శిక్షణ అందిస్తామని, కేవలం రూ.20,000 ఫీజుతో ఈ కోర్సులో చేరవచ్చన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్కీ సీనియర్ కన్సల్టెంట్ కె. సుదర్శన్, వాసవి మోటార్స్ సీఈఓ డాక్టర్ వెంకటేశం మాట్లాడారు. కొత్తగా చేరిన 40 మంది విద్యార్థులతో పాటు కాలేజ్ అధికారులు, విభాగాధిపతులు పాల్గొన్నారు. కార్యక్రమానికి జి. నరేష్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

Leave A Reply

Your email address will not be published.