- వెంటనే తగు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోండి.
- ఆంక్షలతో పలు కంపెనీల ఉత్పత్తికి ముప్పు.
- కేంద్రమంత్రులు పీయూష్ గోయల్,అశ్వినీ వైష్ణవ్ లకు మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి.
ముద్ర, తెలంగాణ బ్యూ రో: రేర్ ఎర్త్ ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించిన దరిమిలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి శ్రీధర్‌బాబు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చైనా తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ తయారీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను భేటీ అయ్యారు. రేర్ ఎర్త్ ఎగుమతులపై ఆంక్షల విషయంలో తక్షణ జోక్యం కావాలని కోరారు. “ పలు ప్రముఖ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలు రేర్ ఎర్త్ మాగ్నెట్లు, కీలక ముడి పదార్థాలు, రసాయనాల దిగుమతుల్లో చైనాపై ఆధారపడటం వల్ల తీవ్ర అవరోధాలు ఎదుర్కొంటున్నాయని వివరించారు. ప్రస్తుత పరిస్థితి ఉత్పత్తి స్థాయిని తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్పత్తి తగ్గితే అది ఉపాధి అవకాశాలపై కూడా ప్రభావం చూపే ప్రమాదం ఉన్నందున దీనికి పరిష్కారంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం అత్యవసరమని మంత్రి శ్రీధర్ బాబు కేంద్ర మంత్రికి విరించారు.ఇదే విషయమై కేంద్ర ఐటీ,ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్టవ్ తో సైతం మంత్రి శ్రీధర్ బాబు చర్చించారు.
- పారిశ్రామిక రంగం బలోపేతానికి సహకరించండి.
రాష్ట్రంలో పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం పూర్తి స్థాయి సహకారం అందించాలని మంత్రి శ్రీధర్ బాబు కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కోరారు.ముఖ్యంగా హైదరాబాద్-నాగ్‌పూర్,హైదరాబాద్-వరంగల్,హైదరాబాద్-బెంగళూరు మరియు హైదరాబాద్-విజయవాడ ఇండస్ట్రీయల్ కారిడార్ల అభివృద్ధి వివరాలు వివరించారు. జహీరాబాద్‌లో అభివృద్ధి చేస్తున్న ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద అవసరమైన మౌలిక సదుపాయాల కోసం రూ.400 కోట్ల నిధులు పీఎం గతిశక్తి పథకం కింద మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
- వరంగల్లో ఫ్యూచర్ సిటీ అభివృద్ది.
గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్-వరంగల్ ఇండస్ట్రీయల్ కారిడార్ నిలిచిపోయిందని కేంద్రమంత్రికి శ్రీధర్‌బాబు దృష్టికి తీసుకెళ్లారు.అయితే.. ఇందులో భాగంగాఉన్న ఫార్మా సిటీని ప్రభుత్వం ఇప్పుడు ‘ఫ్యూచర్ సిటీ’గా అభివృద్ధి చేస్తోందని తెలిపారు. దీనిలో భాగంగా.. వరంగల్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి సహా పలు నోడ్స్‌కు కేంద్రం నిధులు విడుదల చేయాలని కేంద్రమంత్రిని కోరారు.
- పారిశ్రామిక పార్కుల పథకంలో ప్రాధాన్యం ఇవ్వండి.
కేంద్రం ప్రతిపాదించిన 100 పారిశ్రామిక పార్కుల పథకం కింద తెలంగాణలో పార్కుల అభివృద్ధికి రాష్ట్రం ఆసక్తిగా ఉందని, ఇప్పటికే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తమ అభిప్రాయాలు పంపినట్లు గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టులకు తగిన నిధులు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు.
- హైదరాబాద్‌లో జాతీయ డిజైన్ సెంటర్ ఏర్పాటు చేయండి.
దేశంలో డిజైన్ రంగాన్ని ఉద్ధరిస్తూ, మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తుల ద్వారా గ్లోబల్ గుర్తింపు సాధించేలా హైదరాబాద్‌లో జాతీయ డిజైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని రాష్ట్రం ప్రతిపాదించిందన్నారు. ఇది దేశవ్యాప్తంగా డిజైన్ థింకింగ్‌కు కేంద్రంగా మారుతుందన్నారు.
- వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో తెలంగాణ భాగస్వామ్యం.
ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేస్తోందని, కేంద్రంతో కలిసి వికసిత్ భారత్ 2047 లక్ష్యం సాధనలో రాష్ట్రం ముందుంటుందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.