Take a fresh look at your lifestyle.

ఇథనాల్ ఫ్యాక్టరీ మాకొద్దు

  • ఇథనాల్ వివాదం.
  • జోగులాంబ గద్వాల జిల్లాలో తిరబడిన రైతులు.
  • ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతు పోరు ఉధృతం.
  • తాత్కాలిక కంటైనర్లు, వాహనాలు ధ్వంసం.
  • కొన్ని వాహనాలకు నిప్పు – పోలీసులు లాఠీచార్జ్.
  • కదంతొక్కిన పెద్ద ధన్వాడ.
  • వివాదంపై మండిపడ్డ విపక్షాలు.

ముద్ర, తెలంగాణ బ్యూరో : జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలి పరిధిలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు పెద్ద వివాదంగా రాజుకుంది. ఈ మేరకు బుధవారం ఉదయం 12 గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలు ఊహించని రీతిలో పెద్ద ధన్వాడలో ఫ్యాక్టరీ నిర్మించ తలపెట్టిన ప్రాంతానికి చేరుకుని ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరు ఉధృతం చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులను పోలీసులు లాఠీచార్జ్ జరపడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన రైతులు ఫ్యాక్టరీ పనులు చేపట్టేందుకు వచ్చిన కూలీలు, గాయత్రి కంపెనీ యాజమాన్యం తరపు ప్రతినిధిలపై కర్రలతో తిరగబడ్డారు. యాజమాన్యానికి చెందిన కార్లతో పాటు టెంట్లు ఇతర సామాగ్రిని పూర్తిగా ధ్వంసం చేసి వాటికి నిప్పంటించారు.

  • కాలుష్య కోరల్లో చిక్కుకుంటామని ప్రజలు ఆందోళన.

గాయత్రి సంస్థ యాజమాన్యం ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే పెద్ద ధన్వాడ సహా చుట్టుపక్కల ఉన్న 12 గ్రామాలు కాలుష్య కోరల్లో చిక్కుకుంటాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కృష్ణానది తీరంలో ఇటువంటి ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం వలన పర్యావరణానికి తీరని నష్టం జరిగే అవకాశం ఉందని వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు అనుమతులను రద్దు చేయాలని ధన్వాడ సమీప గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మానవ మనుగడకు నిప్పు పెట్టే ఇథనాల్ ఫ్యాక్టరీ తమకొద్దు అంటూ నినాదించారు. రైతులకు మద్దతు తెలిపిన ప్రజా సంఘాల నాయకులను, రైతు సంఘం నాయకులను ప్రభుత్వం ముందస్తు అరెస్టులు చేయించడం దారుణమని రైతులు పేర్కొన్నారు. ఇథనాల్ కంపెనీ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే అడ్డుకుంటామని రైతులు తీవ్రంగా హెచ్చరించారు. గతంలో కంపెనీ నిర్మాణానికి వ్యతిరేకంగా రిలే నిరాహారదీక్షలు దీక్షలు చేపట్టిన సమయంలో దీక్ష శిబిరాన్ని సందర్శించి ఇచ్చిన హామీలను ఆయా రాజకీయ పార్టీల నాయకులు విస్మరించారని ఆరోపించారు.

  • రైతులపై రౌడీయిజం దారుణం – ఆంజనేయ గౌడ్.

ధన్వాడలో రైతులపై రౌడీయిజం దారుణమని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ మండిపడ్డారు. అధికార పార్టీ ముఖ్య నేతల అండతోనే ఇథనాల్ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులపై అరాచకాలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న రైతులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు రైతుల పోరాటానికి అన్ని వర్గాలు అండగా నిలబడాలని ఆయన కోరారు.

Leave A Reply

Your email address will not be published.