- ప్రతి ఒక్కరికి రెండు పాడి గేదెలు.
- సభ్యులు కాంట్రిబ్యూషన్ చెల్లించాల్సిన పని లేదు.
- డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.
మధిర, ముద్ర విలేకరి : గొప్ప ఆశయంతో మధిర నియోజకవర్గంలో చేపట్టిన కార్యక్రమం ఇందిరా డెయిరీయని, అధికారులు మనస్ఫూర్తిగా పని చేసి దీనిని విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మంగళవారం మధిర క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్ తో కలిసి, డిఆర్డీవో, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ అధికారులతో ఇందిరా డైరీపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ఇందిరా డెయిరీ పథకంలో ప్రతి లబ్ధిదారునికి రెండు గేదెలు అంద జేయాలని, సభ్యులు ఎటువంటి కాంట్రిబ్యూషన్ చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు. కాంట్రిబ్యూషన్ కు సంబంధించి సభ్యులకు అధికారులు స్పష్టమైన సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఇందిరా డెయిరీ సభ్యులకు భూమి ఉండాలన్న నిబంధన ఏదీ లేదని, అసలు గేదెలు లేనివారికి ఈ పథకంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు.రానున్న ఐదు నెలల్లో నియోజక వర్గ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఇందిరా డెయిరీ ప్రారంభం కావాలన్నారు. పనులు వేగవంతం చేసేందుకు, గేదెల కొనుగోలుకు అధికార బృందాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ముజిమిల్ ఖాన్ ను ఆదేశించారు. గేదెల కొనుగోలు బృందంలో తప్పని సరిగా ఒక విజిలెన్స్ అధికారి ఉండేలా చూడాలన్నారు. ప్రస్తుతం నియోజక వర్గంలో ఉన్న గేదెలు, కొత్తగా రాబోతున్న గేదెలు, వాటికి అవసరమైన పచ్చి గడ్డి, ఎండు గడ్డిని సకాలంలో అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.ఈ పథకాన్ని విజయవంతం చేసేందుకు పటిష్ట కార్యాచరణతో ముందుకు వెళ్లాలని డిప్యూటీ సీఎం భట్టి సూచించారు.ఈ సమీక్షలో డిఆర్డీవో సన్యాసయ్య, డీపీఓ ఆశాలత,డీటీడబ్ల్యుఓ విజయలక్ష్మి, ఎల్డిఎం శ్రీనివాస రెడ్డి, డివిహెచ్ఓ శ్రీనివాస రావు, డీఏఓ పుల్లయ్య, డిబిసిడిఓ జ్యోతి, ఎస్సి కార్పొరేషన్ ఇడి నవీన్ బాబు తదితరులు పాల్గొన్నారు.