Take a fresh look at your lifestyle.

మధ్యాహ్న భోజనం…. నిర్వహణ భయం భయం మరో ప్రధానోపాధ్యాయునిపై వేటు

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజన నిర్వహణకు మరో ప్రధానోపాధ్యాయునిపై సస్పెన్షన్ వేటు పడింది. నిర్మల్ రూరల్ మండలం కడ్తాల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె వెంకటేశ్వర్ ను సస్పెండ్ చేస్తూ డీఈఓ దర్శనం భోజన్న ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యాహ్న భోజన నిర్వహణ ఒక సమస్యగా మారుతూ వస్తున్న తరుణంలో ప్రధానోపాధ్యాయుని బాధ్యత చేపట్టడం కత్తి మీద సాములా మారింది. ప్రభుత్వం సన్న బియ్యం సరఫరా చేస్తున్నట్లు ప్రకటించినా వీటిలో చిన్న చిన్న రాళ్లు, పురుగులు వస్తుండడంతో ఆరు మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులకు, ఇటు ప్రధానోపాధ్యాయులకు సమస్యగా మారింది. ఒక పక్క విధులు నిర్వహిస్తూనే మరో పక్క మధ్యాహ్న భోజన నిర్వహణ ఒక సవాలుగా మారింది. తాజాగా జరిగిన ఈ ఉదంతంలో మధ్యాహ్న భోజనంలో రాళ్ళు, పురుగులు వచ్చాయని ఆరోపణలున్నాయి. ఐతే పర్యవేక్షణ బాధ్యతలు ఒక్క ప్రధానోపాధ్యాయుడే నిర్వహించటం సమస్య కాగా, సరిపడా సిబ్బంది లేకపోవటం మరో సమస్య. ఈ ఉదంతంలో మొత్తం 9 మంది సిబ్బందికి గాను ఒకరిని నిర్మల్ బాలికల ఉన్నత పాఠశాలకు డిప్యూట్ చేశారు. ఇద్దరు రిటైర్ అయ్యారు. ఉన్న ఆరుగురిలో నలుగురు పదోతరగతి విధులకు వెళ్లారు. ఉన్న ప్రధానోపాధ్యాయుడు, మరో ఉపాధ్యాయుడు నాలుగు తరగతులు పర్యవేక్షిస్తూ మధ్యాహ్న భోజనం కూడా చూసుకోవాలంటే సాధ్యం అవుతుందా అన్నది అధికారులకే తెలియాలి. సన్న బియ్యం సరఫరా చేస్తున్నట్లు చెబుతున్న జిల్లా అధికారులు వాటి పరిస్థితి గురించి పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు చోటు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే మధ్యాహ్న భోజన నిధులు కూడా సక్రమంగా రాని ఫలితంగా ఏజెన్సీలు కూడా వంట చేసేందుకు ఆసక్తి కనబరచటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నిర్వహణా వైఫల్యం పేరిట చర్యలకు ఉపక్రమించటం ఎంత వరకు సమంజసమని ఉపాధ్యాయ లోకం వాపోతోంది. బియ్యం సరఫరా సమయంలోనే శుభ్ర పరచిన బియ్యం పంపిస్తే ఈ సమస్య ఉండదని విద్యార్థులు పేర్కొంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.